టీమిండియా క్రికెటర్లు లేకుండానే ఐసీసీ అవార్డులు 

8 Jun, 2021 17:35 IST|Sakshi

దుబాయ్‌: ఐసీసీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డులకు వరుసగా రెండో నెల కూడా భారత క్రికెటర్లు నామినేట్‌ కాలేదు. ఈ ఏడాది జనవరి నుంచి ప్రకటిస్తూ వస్తున్న ఈ అవార్డులను తొలిసారి(జనవరి) టీమిండియా డాషింగ్‌ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ దక్కించుకోగా, ఫిబ్రవరి నెలకు అశ్విన్‌, మార్చిలో భువనేశ్వర్‌ కుమార్‌, ఏప్రిల్‌ నెలకు పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ దక్కించుకున్నారు. కాగా, మే నెలకు గాను నామినేట్ అయిన పురుషులు, మహిళా క్రికెటర్ల జాబితాను ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. పురుషుల క్రికెట్‌లో హసన్ అలీ(పాకిస్థాన్​), ప్రవీణ్ జయవిక్రమ(శ్రీలంక), ముష్ఫికర్ రహీమ్(బంగ్లాదేశ్​)లు నామినేట్ కాగా, మహిళల క్రికెట్లో క్యాథరిన్​ బ్రైస్​(స్కాట్లాండ్), గేబీ లూయిస్​(ఐర్లాండ్), లీ పాల్​(ఐర్లాండ్) నామినేట్‌ అయ్యారు.

మే నెలలో జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల్లో పాక్ యువ​బౌలర్​హసన్​అలీ 8.92 సగటుతో 14 వికెట్లు పడగొట్టి ఈ నెల ఐసీసీ అవార్డుల రేసులో ముందుండగా, శ్రీలంక అరంగేట్ర బౌలర్​ప్రవీణ్‌ జయవిక్రమ బంగ్లాదేశ్‌తో ఆడిన టెస్టులో ఏకంగా 11 వికెట్లు పడగొట్టి, హసన్​అలీకి గట్టి పోటీగా నిలిచాడు. మరోవైపు బంగ్లా ఆటగాడు ముష్ఫికర్‌ రహీమ్‌.. శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 79 సగటుతో 237 పరుగులు చేసి, తాను కూడా ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు రేసులో ఉన్నానని సవాల్‌ విసురుతున్నాడు. ఈ సిరీస్‌లో జరిగిన రెండో వన్డేలో రహీమ్‌ 125 పరుగులు సాధించడంతో బంగ్లా తొలిసారి లంకపై వన్డే సిరీస్‌ గెలిచింది.
చదవండి: టీమిండియాకు శుభవార్త.. ఆ మ్యాచ్‌ అయ్యాక 20 రోజులు రిలాక్స్‌

మరిన్ని వార్తలు