ఐసీసీ టెస్టు జట్టు: ఆసీస్‌, ఇంగ్లండ్‌ ఆటగాళ్ల హవా.. భారత్‌ నుంచి ఒకే ఒక్కడు

24 Jan, 2023 15:45 IST|Sakshi
రిషభ్‌ పంత్‌

ICC Men’s Test Team of the Year 2022: గతేడాది టెస్టుల్లో తమదైన ముద్ర వేసిన పురుష క్రికెటర్లతో కూడిన జట్టును అంతర్జాతీయ క్రికెట్‌ మండలి మంగళవారం ప్రకటించింది. 2022 ఏడాదికి గానూ.. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 11 మంది ప్లేయర్ల పేర్లను వెల్లడించింది. ఈ జట్టుకు బెన్‌స్టోక్స్‌ను సారథిగా ఎంపిక చేసిన ఐసీసీ.. టీమిండియా బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌కు వికెట్‌ కీపర్‌గా అవకాశమిచ్చింది.

భారత్‌ నుంచి ఒకే ఒక్కడు
కాగా టీమిండియా నుంచి పంత్‌ ఒక్కడికే ఐసీసీ అత్యుత్తమ టెస్టు జట్టులో స్థానం దక్కడం విశేషం. ఈ టీమ్‌లో ఓపెనర్లుగా ఉస్మాన్‌ ఖవాజా, క్రెయిగ్‌ బ్రాత్‌వెయిట్‌.. మూడో స్థానంలో మార్నస్‌ లబుషేన్‌, ఆ తర్వాతి స్థానాల్లో బాబర్‌ ఆజం, జానీ బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్‌, రిషభ్‌ పంత్‌, ప్యాట్‌ కమిన్స్‌కు చోటిచ్చింది ఐసీసీ. 

ఆసీస్‌, ఇంగ్లండ్‌ ఆటగాళ్ల హవా
పేస్‌ విభాగంలో కగిసో రబడ, జేమ్స్‌ ఆండర్సన్‌ స్పిన్‌ విభాగంలో నాథన్‌ లియోన్‌ ఐసీసీ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇప్పటికే 2021-23 సీజన్‌లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరిన ఆసీస్‌ జట్టుకు చెందిన ఆటగాళ్లు అత్యధికంగా నలుగురు ఈ జట్టులో స్థానం సంపాదించారు.

బజ్‌బాల్‌ విధానంతో టెస్టు క్రికెట్‌లోనూ దూకుడు ప్రదర్శిస్తున్న సారథి స్టోక్స్‌తో పాటు బెయిర్‌స్టో, ఆండర్సన్‌ ఇంగ్లండ్‌ నుంచి చోటు దక్కించుకున్నారు. 

వారెవ్వా పంత్‌
2022లో టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ పంత్‌ 12 ఇన్నింగ్స్‌లో 61.81 సగటుతో 680 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు, నాలుగు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక గతేడాది పంత్‌ టెస్టుల్లో 21 సిక్సర్లు బాదాడు. ఆరు స్టంప్స్‌లో భాగమయ్యాడు. 23 క్యాచ్‌లు అందుకున్నాడు. కాగా గతేడాది డిసెంబరు 30న కారు ప్రమాదానికి గురైన పంత్‌ కోలుకుంటున్న విషయం విదితమే.

ఐసీసీ మెన్స్‌ టెస్టు టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2022
1.ఉస్మాన్‌ ఖవాజా- ఆస్ట్రేలియా
2.క్రెయిగ్‌ బ్రాత్‌వెట్‌- వెస్టిండీస్‌
3.మార్నస్‌ లబుషేన్‌- ఆస్ట్రేలియా
4.బాబర్‌ ఆజం- పాకిస్తాన్‌
5.జానీ బెయిర్‌స్టో- ఇంగ్లండ్‌
6.బెన్‌ స్టోక్స్‌- ఇంగ్లండ్‌ (కెప్టెన్‌)
7.రిషభ్‌ పంత్‌- ఇండియా(వికెట్‌ కీపర్‌)
8.ప్యాట్‌ కమిన్స్‌- ఆస్ట్రేలియా
9.కగిసో రబడ- సౌతాఫ్రికా
10.నాథన్‌ లియోన్‌- ఆస్ట్రేలియా
11.జేమ్స్‌ ఆండర్సన్‌- ఇంగ్లండ్‌.

చదవండి: IND VS NZ 3rd ODI: 17 నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు సెంచరీ బాదిన హిట్‌మ్యాన్‌
ఐసీసీ అత్యుత్తమ వన్డే జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా బాబర్‌ ఆజం.. టీమిండియా నుంచి ఇద్దరే

మరిన్ని వార్తలు