ICC WTC Points Table: బంగ్లాపై గెలుపు.. రెండో స్థానంలో పాక్‌

8 Dec, 2021 19:10 IST|Sakshi

Pakistan Stands Second In ICC WTC Points Table: రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టెస్ట్‌ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 8 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసిన పర్యాటక పాక్‌ జట్టు.. ఐసీసీ ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్షిప్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఈ విజయంతో సిరీస్‌ను 2-0తేడాతో కైవసం చేసుకున్న బాబర్‌ సేన.. పాయింట్ల శాతాన్ని 66.66 నుంచి 75 శాతానికి పెంచుకుంది. ప్రస్తుత డబ్ల్యూటీసీ(2021-23)లో భాగంగా ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన పాక్‌.. 3 విజయాలు, ఓ పరాజయంతో 36 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 


ఈ జాబితాలో శ్రీలంక ఒక్క పరాజయం కూడా నమోదు చేయకపోవడంతో 100 శాతం పాయింట్లను దక్కించుకుని అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఇటీవలే న్యూజిలాండ్‌పై 1-0తో సిరీస్‌ విజయాన్ని సాధించిన టీమిండియా 58.33 పాయింట్ల శాతంతో మూడో స్థానంలో నిలచింది. డబ్ల్యూటీసీలో భాగంగా భారత్‌ 3 విజయాలు, 2 డ్రాలు, ఓ పరాజయంతో 42 పాయింట్లు సాధించింది. 

ఇదిలా ఉంటే, వర్షం కారణంగా సుమారు రెండు రోజుల ఆట వర్షార్పణం అయిన బంగ్లా-పాక్‌ రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో.. పాక్ ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పాక్ స్పిన్నర్ సాజిద్‌ ఖాన్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఏకంగా 12 వికెట్లు పడగొట్టి బంగ్లా పతానాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 4 వికెట్లు నష్టానికి 300 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాను 87 పరుగులకే ఆలౌట్‌ చేసిన పాక్‌.. ప్రత్యర్ధిని ఫాలో ఆన్‌ ఆడించి రెండో ఇన్నింగ్స్‌లో 205 పరుగులకే కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన చేసిన సాజిద్‌ ఖాన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించగా.. తొలి టెస్టులో సెంచరీతో పాటు రెండు టెస్టుల్లో నిలకడగా రాణించిన పాక్‌ ఓపెనర్‌ అబిద్ అలీకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. 
చదవండి: టీమిండియా 29 ఏళ్ల దాహం తీరేనా.. దక్షిణాఫ్రికాలో సిరీస్‌ విజయంపై ప్రోమో అదుర్స్‌

మరిన్ని వార్తలు