Ind Vs Pak: భారత్‌ చేతిలో ఓడినా సరే.. మాకు అదే ముఖ్యం: పాక్‌ స్టార్‌ క్రికెటర్‌

29 Jun, 2023 14:46 IST|Sakshi

ICC World Cup 2023 Ind Vs Pak: ఐసీసీ మెగా ఈవెంట్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. భారత్‌ వేదికగా అక్టోబరు 5- నవంబరు 19 వరకు వన్డే ప్రపంచకప్‌-2023 నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ మేజర్‌ టోర్నీలో దాయాదులు భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంను వేదికగా ఫిక్స్‌ చేసింది ఐసీసీ. 

అక్టోబరు 15న జరుగనున్న చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులు పోటెత్తడం ఖాయం. ఇక టీ20 ప్రపంచకప్‌-2022 తర్వాత తొలిసారి భారత్‌- పాక్‌ ముఖాముఖి పోటీపడనున్న నేపథ్యంలో పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఒత్తిడి కూడా ఉంటుంది
క్రికెట్‌ పాకిస్తాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘టీమిండియాతో మ్యాచ్‌ అంటే ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటుంది. అదే స్థాయిలో ఒత్తిడి కూడా ఉంటుంది. ఇప్పుడు మేము భారత్‌కు వెళ్లాల్సి ఉంది. 

సొంతగడ్డపై మ్యాచ్‌ జరగడం వాళ్లకు కలిసి వస్తుంది. ప్రేక్షకుల మద్దతు కూడా వాళ్లకే ఉంటుంది. అయితే, మేము వరల్డ్‌కప్‌ లాంటి మేజర్‌ టోర్నీ ఆడేందుకు అక్కడికి వెళ్తున్నాం. కాబట్టి మా దృష్టి మొత్తం దానిమీదే ఉండాలి.

అదొక్కటే ముఖ్యం కాదు
కేవలం టీమిండియాను ఓడించడమే ప్రధాన లక్ష్యం కాదు. ఒకవేళ భారత జట్టును ఓడించినప్పటికీ మేము టైటిల్‌ గెలవలేదంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు కదా! నా అభిప్రాయం ప్రకారం.. ఒకవేళ మేము టీమిండియా చేతిలో ఓటమిపాలైనా.. వరల్డ్‌కప్‌ గెలిస్తే అదే అసలైన విజయం.

మా ప్రధాన లక్ష్యం కూడా అదే కావాలి’’ అని షాదాబ్‌ ఖాన్‌ పేర్కొన్నాడు. కాగా పాక్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులో కీలక సభ్యుడైన షాదాబ్‌ ఖాన్‌.. ప్రపంచకప్‌ ఈవెంట్‌ తర్వాత టెస్టు క్రికెట్‌పై కూడా దృష్టి సారించనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించాడు.

వరల్డ్‌కప్‌-2023లో పాకిస్తాన్‌ జట్టు మ్యాచ్‌ల షెడ్యూల్‌, వివరాలు:
►అక్టోబర్ 12: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో పాకిస్తాన్ vs క్వాలిఫయర్ 2
►అక్టోబర్ 15: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్తాన్ వర్సెస్ భారత్
►అక్టోబర్ 20: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్తాన్ vs ఆస్ట్రేలియా
►అక్టోబర్ 23: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్తాన్ vs ఆఫ్ఘనిస్తాన్

►అక్టోబర్ 27: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్తాన్ vs దక్షిణాఫ్రికా
►అక్టోబర్ 31: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్తాన్ vs బంగ్లాదేశ్
►నవంబర్ 4: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్తాన్ vs న్యూజిలాండ్
►నవంబర్ 12: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్తాన్ vs ఇంగ్లాండ్.

చదవండి: World Cup 2023: టీమిండియాకు బిగ్‌షాక్‌.. వరల్డ్‌కప్‌కు స్టార్‌ ఆటగాడు దూరం!
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌.. వెస్టిండీస్‌ కీలక నిర్ణయం!

మరిన్ని వార్తలు