Ind vs Aus: లక్ష్మణ్‌ హెడ్‌కోచ్‌గా సూర్య కెప్టెన్సీలో! షెడ్యూల్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌, జట్ల వివరాలు

22 Nov, 2023 21:26 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో ఓటమి బాధను మర్చిపోకముందే.. భారత జట్టు తిరిగి మైదానంలో దిగేందుకు సిద్ధమైంది. ప్రపంచ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను మొదలుపెట్టనుంది. వైజాగ్‌ వేదికగా గురువారం ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ ఆరంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరుజట్లు అక్కడి చేరుకుని ప్రాక్టీస్‌లో తలమునకలయ్యాయి.

కాగా ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ఎప్పటిమాదిరే రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి దూరంగా ఉండనున్నారు. ఇక వీరితో పాటు వన్డే వరల్డ్‌కప్‌ ఆడిన శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా, సిరాజ్‌, బుమ్రా, షమీ తదితరులు కూడా విశ్రాంతి తీసుకోనున్నారు. మరోవైపు హార్దిక్‌ పాండ్యా గాయం కారణంగా దూరంగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ తొలిసారి టీమిండియా సారథిగా ఈ సిరీస్‌తో పగ్గాలు చేపట్టనున్నాడు.

ఇక హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ గైర్హాజరీలో వీవీఎస్‌ లక్ష్మణ్‌ మరోసారి టీమిండియాకు మార్గదర్శనం చేయనున్నాడు. ఈ దిగ్గజ బ్యాటర్‌ నేతృత్వంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలు వైరల్‌గా మారాయి.

ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ షెడ్యూల్‌
►తొలి టీ20- నవంబరు 23- గురువారం- వైజాగ్‌
►రెండో టీ20- నవంబరు 26- ఆదివారం- తిరువనంతపురం
►మూడో టీ20- నవంబరు 28- మంగళవారం- గువాహటి
►నాలుగో టీ20- డిసెంబరు 1- శుక్రవారం- రాయ్‌పూర్‌
►ఐదో టీ20- డిసెంబరు 3- ఆదివారం- బెంగళూరు

ఆరంభ సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌
భారత్‌ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు ఆరంభం కానున్నాయి. టీవీలో.. స్పోర్ట్స్‌ 18, కలర్స్‌ సినీప్లెక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అదే విధంగా డిజిటల్‌ మీడియాలో జియో సినిమాలో లైవ్‌ స్ట్రీమింగ్‌ జరుగనుంది. 

ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా
సూర్యకుమార్‌ యాదవ్‌(కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌ (వైస్‌ కెప్టెన్ ), ఇషాన్‌ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్‌ వర్మ, రింకూ సింగ్, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్, అక్షర్‌ పటేల్, శివమ్‌ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌ సింగ్, ప్రసిధ్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్, ముకేశ్‌ కుమార్‌.

ఆస్ట్రేలియా జట్టు
మాథ్యూ వేడ్ (కెప్టెన్), ఆరోన్ హార్డీ, జాసన్ బెహ్రెన్డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్‌, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, కేన్ రిచర్డ్సన్, ఆడం జంపా.

చదవండి: అందుకే దాన్ని ఫైనల్‌ అంటారు: కైఫ్‌ విమర్శలపై వార్నర్‌ స్పందన

మరిన్ని వార్తలు