Ind Vs Aus 3rd T20- Rohit Sharma: పంత్‌ను అందుకే ఆడించలేదు; హైదరాబాద్‌లో మ్యాచ్‌ ప్రత్యేకం.. ఎందుకంటే!

26 Sep, 2022 08:43 IST|Sakshi
రోహిత్‌ శర్మ- టీమిండియా ఆటగాళ్లు(PC: BCCI)

Ind Vs Aus 3rd T20- Rohit Sharma Comments: ఆస్ట్రేలియాతో మూడో టీ20లో ఘన విజయం సాధించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది టీమిండియా. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదికగా ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌ అభిమానులకు పొట్టి ఫార్మాట్‌లోని మజాను అందించింది. చివరి ఓవర్‌ వరకు నువ్వా నేనా అంటూ సాగిన పోరులో రోహిత్‌ సేననే విజయం వరించింది. 

ఇక్కడ మ్యాచ్‌ ఎంతో ప్రత్యేకం
విరాట్‌ కోహ్లి(48 బంతుల్లో 63 పరుగులు), సూర్యకుమార్‌ యాదవ్‌(36 బంతుల్లో 69 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయం అందించారు. ఈ నేపథ్యంలో విజయానంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ఉప్పల్‌లో మ్యాచ్‌ తనకు ప్రత్యేకమంటూ హైదరాబాద్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.

సానుకూల అంశాలతో పాటు..
ఐపీఎల్‌లో దక్కన్‌ చార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సమయంలో ఇక్కడ ఎన్నో మ్యాచ్‌లు ఆడానని తెలిపాడు. అదే విధంగా టీమిండియాకు కూడా ఇక్కడ మంచి రికార్డు ఉందని చెప్పుకొచ్చాడు. ఇక ఉత్కంఠ పోరులో జట్టు గెలిచిన తీరును కొనియాడుతూ.. ‘‘టీ20 ఫార్మాట్‌లో ఆఖరి క్షణం వరకు మ్యాచ్‌ ఎటు వైపు తిరుగుతుందో చెప్పలేం. మా వాళ్లు ధైర్యంగా ముందడుగు వేశారు.

అయితే, సానుకూల అంశాలతో పాటు గత మ్యాచ్‌లలో మేము చేసిన తప్పిదాలపై దృష్టి సారించాల్సి ఉంది. బుమ్రా, హర్షల్‌ కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుంది. తదుపరి సిరీస్‌లో వాళ్లు రాణిస్తారనే నమ్మకం ఉంది’’ అని హిట్‌మ్యాన్‌ చెప్పుకొచ్చాడు.

అందుకే పంత్‌ను ఆడించలేదు!(Rohit Sharma Explains Why Pant Misses Out)
ఇక ఉప్పల్‌లో మ్యాచ్‌కు పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తిరిగి జట్టులోకి రాగా.. రిషభ్‌ పంత్‌కు తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఈ విషయం గురించి టాస్‌ సమయంలో రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ‘‘భువీ వచ్చాడు. రిషభ్‌ జట్టులో లేడు. నిజానికి గత మ్యాచ్‌లో(నాగ్‌పూర్‌) కేవలం నలుగురు బౌలర్లనే ఆడించాలనుకున్నాం.

అందుకే దురదృష్టవశాత్తూ భువీకి అప్పుడు చోటు దక్కలేదు’’ అంటూ పంత్‌ను ఆడించకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ సహా హర్షల్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, యజువేంద్ర చహల్‌తో బరిలోకి దిగింది.

చదవండి: Ind Vs Aus 3rd T20- Rohit Sharma: హైదరాబాద్‌ బిర్యానీకి రోహిత్‌ ఫిదా 
IND vs AUS: టీమిండియాపై గ్రీన్‌ సరికొత్త చరిత్ర.. తొలి ఆటగాడిగా!

మరిన్ని వార్తలు