Ind vs Aus: ఆదిలోనే వికెట్‌.. వీడియో వైరల్‌! షమీ ఎందుకు వెళ్లిపోయాడంటే?

22 Sep, 2023 15:00 IST|Sakshi
షమీ- మార్ష్‌ (PC: BCCI)

India vs Australia, 1st ODI: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ సందర్భంగా టీమిండియా వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. తొలి వన్డేలో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. మొహాలీ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు తొలి ఓవర్లోనే షాకిచ్చాడు షమీ. బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభించిన అతడు.. నాలుగో బంతికే ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ను పెవిలియన్‌కు పంపాడు. గుడ్‌ లెంత్‌ డెలివరీతో మార్ష్‌ను బోల్తా కొట్టించాడు. బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకిన బంతి ఫస్ట్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న శుభ్‌మన్‌ గిల్‌ చేతిలో పడింది.

ఎలాంటి పొరపాటుకు తావు లేకుండా.. బాల్‌ను గిల్‌ ఒడిసిపట్టగానే.. భారత శిబిరంలో నవ్వులు పూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో క్రికెట్‌ అభిమానులను ఆకర్షిస్తోంది.

ఆనందం కాసేపే..
ఇదిలా ఉంటే.. టీమిండియాకు ఆదిలోనే వికెట్‌ దక్కినప్పటికీ.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ 37, ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అర్ధ సెంచరీతో చెలరేగడంతో 18 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ 98 పరుగులు స్కోరు చేసింది. కానీ.. మరుసటి రెండో బంతికే రవీంద్ర జడేజా వార్నర్‌(52)ను పెవిలియన్‌కు పంపడంతో ఆసీస్‌ రెండో వికెట్‌ కోల్పోయింది.

షమీ ఎందుకు వెళ్లిపోయాడు?
ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఏడు ఓవర్లు ముగిసిన తర్వాత మహ్మద్‌ షమీ మైదానం వీడాడు. మొహాలీలో ఎండ తీవ్రతకు తట్టుకోలేకే అతడు డ్రెస్సింగ్‌రూంకు వెళ్లిపోయినట్లు సమాచారం. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత అతడు తిరిగి ఫీల్డ్‌లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.

చదవండి: WC 2023: సంజూను మర్చిపోవాల్సిందే!.. కుండబద్దలు కొట్టిన ద్రవిడ్‌

మరిన్ని వార్తలు