IND Vs ENG: కోహ్లి సంబరాలు మాములుగా లేవు.. వీడియో వైరల్‌

17 Aug, 2021 08:07 IST|Sakshi

లార్డ్స్‌: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సంబరాలు.. అతను చేసిన హంగామా ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కోపం వచ్చినా.. సంతోషం కలిగినా కోహ్లిని ఆపడం ఎవరి వల్ల కాదని మరోసారి నిరూపించాడు.  మ్యాచ్‌ గెలిచిన అనంతరం మైదానంలో భారత ఆటగాళ్లు సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. కానీ తనదైన శైలిలో గట్టిగా అరుస్తూ తోటి ఆటగాళ్లను హగ్‌ చేసుకుంటూ కోహ్లి చేసిన హంగామాతో అందరి దృష్టి అతనిపైకే మళ్లింది.


ఇక కోహ్లి రోహిత్‌ను హగ్‌ చేసుకోవడం హైలెట్‌గా నిలిచింది. ఈ ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు ఉన్నాయంటూ గతంలో పలుమార్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా వీడియోతో మా మధ్య అలాంటివేం లేవని కోహ్లి చెప్పకనే చెప్పాడు. అంతకముందు ఆట నాలుగో రోజు ముగిసిన తర్వాత లార్డ్స్‌ బాల్కనీలో కోహ్లి నాగిన్‌ డ్యాన్స్‌తో అలరించాడు. అతని నాగిన్‌ డ్యాన్స్‌ను చూసిన కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, మహ్మద్‌ సిరాజ్‌లు ఈలలు, గోలతో రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌ అయింది.


ఇక రెండో టెస్టులో ఒక దశలో భారత్‌ మ్యాచ్‌ ఓడిపోతుందనే సందేహాలు కలిగాయి. అయితే రెండో ఇన్నింగ్స్‌లో భారత టెయిలెండర్లు మహ్మద్‌ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, ఇషాంత్‌ శర్మలు అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ ముందు మంచి లక్ష్యాన్నే నిర్ధేశించారు. ఇంగ్లండ్‌ టార్గెట్‌ 272. రెండు సెషన్లు, 60 ఓవర్లు. ఓపెనింగ్‌ సహా టాపార్డర్‌ నిలబడితే, దీనికి వేగం జతయితే ఓవర్‌కు 4 పరుగులు చేయడం ఏమంత కష్టం కాదు. కానీ బుమ్రా, షమీ వారికి ఆ అవకాశమే ఇవ్వలేదు.

ఇద్దరు ప్రారంభ ఓవర్లలోనే బర్న్స్‌ (0), సిబ్లీ (0)లను ఖాతా తెరువనీయలేదు. వీళ్లిద్దరికి తోడుగా ఇషాంత్‌ దెబ్బ మీద దెబ్బ తీశాడు. హమీద్‌ (9), బెయిర్‌ స్టో (2)ల పనిపట్టాడు. కెప్టెన్‌ రూట్‌ (60 బంతుల్లో 33; 5 ఫోర్లు) జట్టును కాపాడాలనుకున్నా బుమ్రా ఆ అవకాశం అతనికి ఇవ్వలేదు. ఈ స్థితిలో డ్రా చేసుకోవడం కూడా ఇంగ్లండ్‌కు కష్టమే! అయినా సరే బట్లర్‌ (96 బంతుల్లో 25; 3 ఫోర్లు) ప్రయత్నిద్దామనుకున్నాడు. కానీ సీన్‌లోకి ఈ సారి సిరాజ్‌ వచ్చాడు. వరుస బంతుల్లో మొయిన్‌ అలీ (13), స్యామ్‌ కరన్‌ (0)లను ఔట్‌ చేశాడు. తర్వాత బట్లర్‌ను తనే పెవిలియన్‌ చేర్చాడు. ఇంగ్లండ్‌కు ఊహించని షాక్‌లిచ్చారు. డ్రాతో గట్టెక్కాల్సిన చోట గెలుపు సంబరమిచ్చారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు