Hardik Pandya: ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్‌కు ఒకే ఓవర్‌.. అయితే తదుపరి టీ20లో: పాండ్యా

27 Jun, 2022 16:27 IST|Sakshi
హార్దిక్‌ పాండ్యా, ఉమ్రాన్‌ మాలిక్‌(PC: BCCI)

India vs Ireland T20 Series: శ్రీనగర్‌ సంచలనం, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫాస్టెస్ట్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ ఎట్టకేలకు ఐర్లాండ్‌తో సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో మొదటి టీ20 ద్వారా అరంగేట్రం చేశాడు. భారత్‌ తరఫున ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ పొట్టి ఫార్మాట్‌తో ఎంట్రీ ఇచ్చాడు. 

టీమిండియా సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ చేతుల మీదుగా క్యాప్‌(నంబర్‌ 98) అందుకున్నాడు. అయితే, వరణుడి ఆటంకం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ఈ జమ్మూ ఎక్స్‌ప్రెస్‌కు ఒకే ఓవర్‌ బౌల్‌ చేసే అవకాశం వచ్చింది.

ఈ క్రమంలో ఉమ్రాన్‌ మాలిక్‌ 14 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ ఉన్నాయి. అయితే, ఉమ్రాన్‌కు ఒకే ఓవర్‌ వేసే అవకాశం ఇవ్వడంపై తాత్కాలిక కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మ్యాచ్‌ అనంతరం స్పందించాడు.

ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘తన ఫ్రాంఛైజీ తరఫును ఉమ్రాన్‌ మాలిక్‌ అద్భుతంగా ఆడాడు. అయితే, అతడితో సంభాషణ సందర్భంగా పాత బంతితో తను మెరుగ్గా బౌల్‌ చేయగలడని తెలుసుకున్నాను. నిజానికి మా కీలక బౌలర్లను ఐర్లాండ్‌ బ్యాటర్లు అద్భుతంగా ఎదుర్కొన్నారు.

ఇక ఉమ్రాన్‌ విషయానికొస్తే అతడికి తదుపరి మ్యాచ్‌లో పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేసే అవకాశం దక్కొచ్చు’’ అని రెండో మ్యాచ్‌లో ఉమ్రాన్‌ను పూర్తి స్తాయిలో బాగా వాడుకుంటామని హింట్‌ ఇచ్చాడు. కాగా ఉమ్రాన్‌ మాలిక్‌కు ఒకే ఓవర్‌ ఇవ్వడంతో పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా పాండ్యా రెండు ఓవర్లు వేసి, ఉమ్రాన్‌ విషయంలో ఇలా వ్యవహరించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. కాగా ఐపీఎల్‌-2022లో ఉమ్రాన్‌ మొత్తంగా 22 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.

ఇండియా వర్సెస్‌ ఐర్లాండ్‌ తొలి టీ20 మ్యాచ్‌ స్కోర్లు:
టాస్‌- భారత్‌- బౌలింగ్‌, వర్షం కారణంగా మ్యాచ్‌ 12 ఓవర్లకు కుదింపు
ఐర్లాండ్‌ స్కోరు: 108/4 (12)
టీమిండియా స్కోరు: 111/3 (9.2)
విజేత: హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం

చదవండి: IND Vs IRE 1st T20: ‘గంటకు 208 కి.మీ. వేగం’.. వరల్డ్‌ రికార్డు బద్దలు కొట్టిన భువీ?! అక్తర్‌ ఎవరు?
Rohit Sharma- T20 Captaincy: టీ20 కెప్టెన్సీ నుంచి అతడికి విముక్తి కల్పించండి!

మరిన్ని వార్తలు