రోహిత్‌ పూర్తిగా నిరాశపరిచాడు.. చెత్తగా ఆడాడు: టీమిండియా మాజీ ఓపెనర్‌

11 Sep, 2023 21:26 IST|Sakshi

Asia Cup, 2023 - Pakistan vs India, Super Fours: పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అవుటైన తీరును భారత మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ విమర్శించాడు. హిట్‌మ్యాన్‌ తనను పూర్తిగా నిరాశపరిచాడన్న గౌతీ.. ఇలాంటి చెత్త షాట్లు ఆడటం ఎందుకంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కీలక సమయంలో వికెట్‌ పారేసుకోవడం ఏమిటని మండిపడ్డాడు.

ఆసియా కప్‌-2023 సూపర్‌-4లో భారత్‌- పాక్‌ రిజర్వ్‌ డే మ్యాచ్‌ ఆదివారం కొలంబో వేదికగా ఆరంభమైంది. టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం తొలుత బౌలింగ్‌ ఎంచుకుని.. భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. 

అర్ధ శతకాలు.. 147 పరుగులు
ఈ క్రమంలో ఓపెనర్లు రోహిత్‌ శర్మ 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 56 పరుగులు, శుబ్‌మన్‌ గిల్‌ 52 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 58 పరుగులు సాధించారు. వీరిద్దరి అర్ధ శతకాల నేపథ్యంలో వర్షం కారణంగా ఆదివారం ఆట నిలిపివేసే సమయానికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 147 పరుగుల మెరుగైన స్కోరు చేయగలిగింది.


గం‍భీర్‌(పాత ఫొటో)

ఈ నేపథ్యంలో గౌతం గంభీర్‌ రోహిత్‌ శర్మ ఆట తీరును విశ్లేషిస్తూ స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘రోహిత్‌ నన్ను పూర్తిగా నిరాశపరిచాడు. చెత్త షాట్‌ సెలక్షన్‌తో అవుటయ్యాడు. ఇలాంటి సాట్‌ ఎంచుకున్న కారణంగా అతడు విమర్శల పాలవుతాడని తనకూ తెలుసు.

చెత్త షాట్‌ సెలక్షన్‌
పాకిస్తాన్‌ బౌలర్లు ఒత్తిడిలో ఉన్న సమయంలో ఇలాంటి షాట్‌కు యత్నించడం సరికాదు. రోహిత్‌, గిల్‌ జోరు కొనసాగుతుంటే టీమిండియా 370-375 వరకు స్కోరు చేసే దిశగా పయనిస్తోందనిపించింది.

కానీ.. రోహిత్‌ చెత్త షాట్‌ ఆడి అంతా తలకిందులు చేశాడు. ఇక మరుసటి ఓవర్లోనే శుబ్‌మన్‌ గిల్‌ కూడా అవుటయ్యాడు. పాకిస్తాన్‌ పటిష్ట బౌలింగ్‌ అటాక్‌ నేపథ్యంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వాళ్లకు ఇవ్వకుండా ఉండాలి కదా!’’ అని గంభీర్‌ చెప్పుకొచ్చాడు. 

షాదాబ్‌, ఆఫ్రిది తలా ఓ వికెట్‌
కాగా భారత ఇన్నింగ్స్‌ 16.4 ఓవర్‌ వద్ద పాక్‌ లెగ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ షాదాబ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో రోహిత్‌ పహీం అష్రఫ్‌నకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. షాదాబ్‌ సంధించిన బంతిని కవర్‌ మీదుగా షాట్‌గా మలచాలని రోహిత్‌ భావించగా.. స్ట్రెయిట్‌గా వెళ్లడంతో పహీం అద్బుత రీతిలో క్యాచ్‌ అందుకున్నాడు. 

ఇదిలా ఉంటే.. మరుసటి ఓవర్‌ ఐదో బంతికి స్టార్‌ పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది గిల్‌ను అవుట్‌ చేశాడు. ఆఫ్రిది వేసిన స్లో బాల్‌ను తప్పుగా అంచనా వేసిన శుబ్‌మన్‌ గిల్‌.. ఆఘా సల్మాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇలా వరుస ఓవర్లలో రోహిత్‌- గిల్‌ జోడీ మైదానం వీడటంతో పాకిస్తాన్‌ జట్టు సంబరాలు చేసుకుంది.

స్కోరు..
 ఇక సోమవారం నాటి ఆటలో విరాట్‌ కోహ్లి(122), కేఎల్‌ రాహుల్‌ (111) అజేయ శతకాలతో చెలరేగడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు స్కోరు చేసింది.

చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్‌కు భారీ షాక్‌! హ్యారిస్‌ రవూఫ్‌ దూరం.. కారణమిదే

మరిన్ని వార్తలు