Shubman Gill: అరుదైన ఘనత.. రోహిత్‌ శర్మ రికార్డు బద్దలు కొట్టిన శుబ్‌మన్‌ గిల్‌! అంతేకాదు..

23 Aug, 2022 13:21 IST|Sakshi
శుబ్‌మన్‌ గిల్‌(PC: BCCI)

India Vs Zimbabwe 3rd ODI 2022- Shubman Gill: జింబాబ్వే పర్యటనలో ఆద్యంతం అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు టీమిండియా యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌. మొదటి వన్డేలో ఓపెనర్‌గా వచ్చి అజేయంగా నిలిచి 82 పరుగులు(72 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో).. రెండో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగి 34 బంతుల్లో 33 పరుగులు సాధించాడు. 

ఇక.. ఆతిథ్య జింబాబ్వేతో మూడో వన్డేలో తన విశ్వరూపం ప్రదర్శించాడు శుబ్‌మన్‌. ఎట్టకేలకు సెంచరీ గండాన్ని గట్టెక్కాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన 22 ఏళ్ల ఈ కుడిచేతి వాటం గల బ్యాటర్‌ 97 బంతుల్లో 130 పరుగులు(15 ఫోర్లు, ఒక సిక్స్‌) చేశాడు. తద్వారా టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ రికార్డు బద్దలు కొట్టడంతో పాటు మరో అరుదైన ఘనత సాధించాడు. (క్లిక్‌: IND vs ZIM: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌.. సచిన్‌ 24 ఏళ్ల రికార్డు బద్దలు!)

రోహిత్‌ రికార్డు బద్దలు
సోమవారం (ఆగష్టు 22)మూడో వన్డేలో శతకం బాదడం ద్వారా అత్యంత పిన్న వయసులో జింబాబ్వే గడ్డ మీద ఈ ఫీట్‌ నమోదు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. 22 ఏళ్ల 348 రోజుల వయసులో గిల్‌ ఈ ఘనత సాధించాడు. తద్వారా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. హిట్‌మ్యాన్‌ 23 ఏళ్ల 28 రోజుల వయసులో జింబాబ్వే మీద సెంచరీ సాధించాడు.

యువీ, కోహ్లితో పాటు..
అదే విధంగా విదేశీ గడ్డ మీద వన్డేల్లో చిన్న వయసులో సెంచరీ సాధించిన భారత క్రికెటర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు గిల్‌. యువరాజ్‌ సింగ్‌( 22 ఏళ్ల 41 రోజులు), విరాట్‌ కోహ్లి(22 ఏళ్ల 315 రోజులు) తర్వాతి స్థానం ఆక్రమించాడు. ఇలా ఈ మ్యాచ్‌లో గిల్‌ తన అంతర్జాతీయ కెరీర్‌లో మొదటి సెంచరీ సాధించడం ద్వారా జట్టును గెలిపించడంతో పాటుగా.. పలు వ్యక్తిగత రికార్డులు సృష్టించాడు.

వెల్‌డన్‌ గిల్‌..
ఈ నేపథ్యంలో గిల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌.. ‘‘పిన్న వయసులో 100.. వెల్‌డన్‌ శుబ్‌మన్‌ గిల్‌’’ అని ట్విటర్‌ వేదికగా కొనియాడాడు. ఇక విండీస్‌ మాజీ ప్లేయర్‌, కామెంటేటర్‌ ఇయాన్‌ బిషప్‌ సైతం గిల్‌ను అభినందించాడు.

ఇక ఈ మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో గెలుపొందిన కేఎల్‌ రాహుల్‌ సేన 3-0తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. అద్బుత శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శుబ్‌మన్‌ గిల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. అదే విధంగా ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా కూడా నిలిచాడు.

చదవండి: Asia Cup 2022: పాక్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ! ద్రవిడ్‌ దూరం?!
Shumban Gill-Sikandar Raza: సెంచరీ వీరుడి సంచలన క్యాచ్‌.. మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌

మరిన్ని వార్తలు