భారత్‌ తొలి ప్రత్యర్థి ఫ్రాన్స్‌

21 Oct, 2021 05:39 IST|Sakshi

లుసాన్‌ (స్విట్జర్లాండ్‌): వచ్చే నెల 24 నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ వేదికగా జరిగే జూనియర్‌ పురుషుల ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌ షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ నవంబర్‌ 24న జరిగే తమ తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ తర్వాత 25న జరిగే రెండో మ్యాచ్‌లో కెనడాతో, 27న జరిగే మూడో  మ్యాచ్‌లో పోలాండ్‌తో టీమిండియా ఆడుతుంది. పూల్‌ ‘బి’లో భారత్‌తోపాటు కెనడా, ఫ్రాన్స్, పోలాండ్‌ జట్లకు చోటు కల్పించారు.

పూల్‌ ‘ఎ’లో బెల్జియం, చిలీ, మలేసియా, దక్షిణాఫ్రికా... పూల్‌ ‘సి’లో దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, స్పెయిన్, అమెరికా... పూల్‌ ‘డి’లో అర్జెంటీనా, ఈజిప్‌్ట, జర్మనీ, పాకిస్తాన్‌ జట్లు ఉన్నాయి. డిసెంబర్‌ 3న సెమీఫైనల్స్, 5న ఫైనల్స్‌ జరుగుతాయి. 2016 ప్రపంచకప్‌ టోర్నీకి కూడా భారతే వేదికగా నిలిచింది. మరోవైపు డిసెంబర్‌ 5 నుంచి 16 వరకు దక్షిణాఫ్రికాలో జరిగే మహిళల జూనియర్‌ ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. పూల్‌ ‘సి’లో ఉన్న భారత్‌ డిసెంబర్‌ 6న తొలి మ్యాచ్‌లో రష్యాతో ఆడుతుంది. ఆ తర్వాత 7న అర్జెంటీనాతో, 9న జపాన్‌తో భారత్‌ తలపడుతుంది.

మరిన్ని వార్తలు