జులన్‌కు క్లీన్‌స్వీప్‌ కానుక

25 Sep, 2022 04:37 IST|Sakshi

చివరి మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌పై నెగ్గిన భారత్‌  

లండన్‌: అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, భారత సీనియర్‌ పేసర్‌ జులన్‌ గోస్వామి కెరీర్‌ విజయంతో ముగిసింది. ఇంగ్లండ్‌ జట్టుతో శనివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వంలోని టీమిండియా 16 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ఈ విజయంతో భారత్‌ సిరీస్‌ను 3–0తో నెగ్గి కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడిన 39 ఏళ్ల జులన్‌ గోస్వామికి క్లీన్‌స్వీప్‌ కానుకగా ఇచ్చింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 45.4 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది.

స్మృతి మంధాన (50; 5 ఫోర్లు), దీప్తి శర్మ (68 నాటౌట్‌; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను స్మృతి, దీప్తి శర్మ ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు వీరిద్దరు 58 పరుగులు జత చేశారు. స్మృతి అవుటయ్యాక ఒకవైపు వికెట్లు పడుతుంటే మరోవైపు దీప్తి పట్టుదలతో ఆడి అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఇంగ్లండ్‌ బౌలర్లలో కేటీ క్రాస్‌ (4/26), ఫ్రేయా కెంప్‌ (2/24), ఎకిల్‌స్టోన్‌ (2/27) రాణించారు. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 43.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది.

కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడిన జులన్‌ గోస్వామి బ్యాటింగ్‌లో ‘డకౌట్‌’కాగా... బౌలింగ్‌లో 10 ఓవర్లలో మూడు మెయిడెన్లు వేసి 30 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రేణుక సింగ్‌ (4/29), స్పిన్నర్‌ రాజేశ్వరి గైక్వాడ్‌ (2/38) కూడా ఇంగ్లండ్‌ను దెబ్బ తీశారు. మొత్తం 340 పరుగులు చేసి రెండు వికెట్లు తీసిన హర్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు లభించింది.

 
355: జులన్‌ గోస్వామి మూడు ఫార్మాట్‌లలో కలిపి తీసిన వికెట్ల సంఖ్య. జులన్‌ 12 టెస్టుల్లో 44 వికెట్లు... 204 వన్డేల్లో 255 వికెట్లు... 68 టి20ల్లో 56 వికెట్లు పడగొట్టింది.

7: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం భారత జట్టుకిది ఏడోసారి (బంగ్లాదేశ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లపై ఒకసారి...
శ్రీలంకపై మూడుసార్లు). ఇంగ్లండ్‌పై  తొలిసారి. 

మరిన్ని వార్తలు