IND vs ENG T20 Series: టి20 సమరానికి సై.. పూర్తి స్థాయి టి20 స్పెషలిస్ట్‌ల టీమ్‌తో ఇంగ్లండ్‌

7 Jul, 2022 00:48 IST|Sakshi

నేడు భారత్, ఇంగ్లండ్‌ తొలి మ్యాచ్‌

బరిలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ

అందుబాటులో లేని సీనియర్లు

రాత్రి గం.10:30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌లలో టి20 ప్రపంచకప్‌ జరగనుంది. ఆ లోగా భారత్‌ వేర్వేరు టోర్నీల్లో కలిపి 15 టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి ప్రపంచకప్‌ జట్టు కూర్పు విషయంలో ఒక అంచనాకు వచ్చేందుకు ఇంగ్లండ్‌తో సిరీస్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో నేటినుంచి జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ కీలకం కానుంది. కరోనా నుంచి కోలుకున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బరిలోకి దిగనుండగా, టెస్టు జట్టులో సభ్యులుగా ఉన్న ఐదుగురు ఆటగాళ్లు తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు.

సౌతాంప్టన్‌: ఇంగ్లండ్‌తో చివరి టెస్టులో ఓటమి ఎదురైన రెండు రోజులకే భారత జట్టు మరో అంతర్జాతీయ పోరుకు సిద్ధమైంది. మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, ఇంగ్లండ్‌ల మధ్య తొలి మ్యాచ్‌ జరుగుతుంది. టెస్టు మ్యాచ్‌కు అందుబాటులో లేని రోహిత్‌ శర్మ నాయకత్వంలో ఈ జట్టు బరిలోకి దిగుతుండగా, రోహిత్‌ శర్మ మినహా మిగతా వారంతా ఇటీవల ఐర్లాండ్‌తో టి20 సిరీస్‌ ఆడిన ఆటగాళ్లే అందుబాటులో ఉన్నారు. విరాట్‌ కోహ్లి, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా, రిషభ్‌ పంత్, శ్రేయస్‌ అయ్యర్‌ రెండో మ్యాచ్‌ నుంచి టీమ్‌తో కలుస్తారు.  

ఆధిపత్యం ఎవరిదో... 
ఇరు జట్ల బలాబలాలు చూస్తే భారత్‌పై ప్రత్యర్థి ఇంగ్లండ్‌దే పైచేయిగా కనిపిస్తోంది. అనుభవజ్ఞుడైన స్టార్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ రావడం టీమిండియాకు పెద్ద అండ కాగా... ఇంగ్లండ్‌ మాత్రం దాదాపు పూర్తి స్థాయి టి20 స్పెషలిస్ట్‌ల టీమ్‌తో బరిలోకి దిగుతోంది. రోహిత్‌ రాకతో గత మ్యాచ్‌లో ఆడిన వారి నుంచి ఎవరిని పక్కన పెడతారనేది ఆసక్తికరం. దీపక్‌ హుడా సెంచరీ, సామ్సన్‌ అర్ధసెంచరీలతో సత్తా చాటగా, బౌలింగ్‌లో భువనేశ్వర్‌దే ప్రధాన పాత్ర. హర్షల్‌కు తోడుగా అర్‌‡్షదీప్‌ అరంగేట్రం చేయవచ్చు. మరోవైపు ఇంగ్లండ్‌లో దాదాపు అంతా విధ్వంసకర ఆటగాళ్లే. కొత్త కెప్టెన్‌ బట్లర్‌తో పాటు డేవిడ్‌ మలాన్, లివింగ్‌స్టోన్, జేసన్‌ రాయ్, సాల్ట్‌... ఇలా అందరూ దూకుడుగా ఆడగలరు. జోర్డాన్, మొయిన్‌ అలీ రూపంలో సరైన ఆల్‌రౌండర్లు కూడా టీమ్‌లో ఉన్నారు. కాబట్టి మ్యాచ్‌ హోరాహోరీగా సాగడం ఖాయం.

మరిన్ని వార్తలు