ధైర్యంగా ఉండు కుల్దీప్‌: మహ్మద్‌ కైఫ్‌

5 Feb, 2021 12:46 IST|Sakshi

చెన్నై: టీమిండియా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌.. 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో చివరిసారిగా సంప్రదాయ క్రికెట్‌ ఆడాడు. సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన నాలుగో టెస్టులో, ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టు నడ్డి విరిచాడు. డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్‌లో తన వంతు పాత్ర పోషించాడు. ఇక అప్పటి నుంచి టీమిండియా టెస్టు స్క్వాడ్‌లో చోటు దక్కించుకుంటున్న కుల్దీప్‌, బెంచ్‌కే పరిమితం అయ్యాడు. బీసీసీఐ ప్రకటించిన 13 టెస్టు మ్యాచ్‌ ప్రాబబుల్స్‌లో అతడికి చోటు దక్కినప్పటికీ ఆడే అవకాశం మాత్రం రాలేదు. మొన్నటికి మొన్న ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌(బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ)లో సైతం కుల్దీప్‌నకు నిరాశే ఎదురైంది. (చదవండి: India Vs England 2021: ఇంగ్లండ్‌కు షాక్‌! )

అయితే, ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగనున్న టెస్టు సిరీస్‌కు ప్రకటించిన జట్టులో కుల్దీప్‌ పేరు ఉండటం, పైగా ఇండియన్‌ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలం అన్న విశ్లేషణల నేపథ్యంలో అతడికి తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగానే కనిపించింది. కానీ మరోసారి కుల్దీప్‌ను దురదృష్టం వెంటాడింది. ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగిన టీమిండియా సీనియర్‌ అశ్విన్‌తో పాటు ఆసీస్‌ టూర్‌లో రాణించిన యువ ఆటగాడు వాషింగ్టన్‌ సుందర్‌ వైపు మొగ్గు చూపింది. అంతేగాక అక్షర్‌ పటేల్‌ మోకాలి నొప్పితో చివరి నిమిషంలో జట్టుకు దూరం కాగా, ఆశ్చర్యకరంగా 31 ఏళ్ల షాబాజ్‌ నదీంను తుది జట్టులోకి తీసుకున్నారు. దీంతో 26 ఏళ్ల కుల్దీప్‌ మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.

ఈ విషయంపై స్పందించిన భారత మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌.. ‘‘ సరిగ్గా రెండేళ్ల క్రితం, టెస్టుల్లో ఇండియా ఫస్ట్‌ చాయిస్‌ అంటే కుల్దీప్‌ యాదవ్‌ అన్న పేరు వినిపించింది. కానీ ఇప్పుడు జట్టులో చోటు కోసం అతడు పోరాడాల్సి వస్తోంది. అయితే అంతగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అశ్విన్‌, పంత్‌ పట్టుదలగా పోరాడిన తర్వాతే జట్టులోకి తిరిగి వచ్చారు. ధైర్యంగా ఉండు కుల్దీప్‌!’’ అని ట్విటర్‌ వేదికగా అతడికి అండగా నిలిచాడు. ఇక కామెంటేటర్‌ హర్షా బోగ్లే సైతం.. కుల్దీప్‌ను ఎంపిక చేయకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అనువజ్ఞుడైన నదీంను ఎంపిక చేయడం సరైందే అయినా, కుల్దీప్‌ పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు.

ఇదిలా ఉండగా.. ప్రతిభ ఉండి సుదీర్ఘ కాలంగా జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న కుల్దీప్‌ను ఉద్దేశించి సోషల్‌ మీడియాలో మీమ్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ‘‘విరాట్‌.. నేను మరీ అంత పనికిరానివాడినా. నన్ను పక్కకు పెట్టావు. నేను చేసిన తప్పేంటి? ఒక్క అవకాశం దక్కితే నన్ను నేను నిరూపించుకుంటాను కదా’’ అంటూ కుల్దీప్‌ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి షేర్‌ చేస్తున్నారు. ముగ్గురు స్పిన్నర్లకు చోటు అన్నపుడు సంతోషించిన కుల్దీప్‌ ప్రస్తుత పరిస్థితి ఇది అంటూ నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు