అశ్విన్‌ సెంచరీ.. హై క్లాస్‌‌: ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్

15 Feb, 2021 17:28 IST|Sakshi

చెన్నై: సెంచరీ హీరో, టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. బ్యాట్స్‌మెన్‌కు అనుకూలం కాదన్న పిచ్‌పై అశ్‌ చెలరేగి ఆడుతూ బౌండరీలు బాదిన తీరును దిగ్గజ ఆటగాళ్లు కొనియాడుతున్నారు. ఏడోస్థానంలో బ్యాటింగ్‌కు దిగి శతకం సాధించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇంగ్లండ్‌తో సొంత మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ ఐదు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో మ్యాజిక్‌ చేసి భారత్‌ 286 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్‌ కోహ్లి(62 పరుగులు) మినహా ఇతర బ్యాట్స్‌మెన్‌ ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయిన తరుణంలో అశ్విన్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. 148 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 106 పరుగులు చేశాడు.

ఈ నేపథ్యంలో అశ్విన్‌ అద్భుత బ్యాటింగ్‌పై టెస్టు స్పెషలిస్టు వీవీఎస్‌ లక్ష్మణ్‌ సహా ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్ ప్రశంసలు కురిపించారు. ‘‘కంఫర్ట్‌ జోన్‌లో ఉండాలనుకుంటే గొప్ప పనులు సాధ్యం కావు. ఈ పిచ్‌ కఠినమైందే తప్ప అసాధ్యమైనది కాదని తన హార్డ్‌ హిట్టింగ్‌తో అశ్విన్‌ నిరూపించాడు. ఇంత గొప్ప ఇన్నింగ్స్‌ ఆడిన అశ్‌కు చేతులెత్తి నమస్కరించడం కంటే ఇంకేం చేయగలను’’ అని లక్ష్మణ్‌ కొనియాడాడు. ఇక మైకేల్‌ వాన్‌ స్పందిస్తూ.. హై క్లాస్‌ ఆట అంటూ అశ్విన్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు.  

కాస్తైనా కనికరం లేకుండా ఇంగ్లండ్‌ బౌలింగ్‌ను చీల్చిచెండాడని, టీమిండియాలో ఇలాంటి నైపుణ్యం కలిగిన ఆటగాళ్లకు కొదవే లేదని పేర్కొన్నాడు.  ఇక దినేశ్‌ కార్తిక్‌ సైతం.. ‘‘ప్రపంచం మొత్తం చెత్త వికెట్‌ అని మాట్లాడుకుంటున్న తరుణంలో, ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అశ్విన్‌ సెంచరీ చేశాడు. పండితుల మెదళ్లలో ఉన్న అనేకానేక సందేహాలకు ఇదొక గుణపాఠం అవుతుందని ఆశిస్తున్నా. సరైన ప్రణాళిక, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే చెన్నై వికెట్‌పై తమను తాము నిరూపించుకునే గొప్ప అవకాశం వస్తుంది’’ అంటూ అశ్విన్‌కు కితాబిచ్చాడు. 

చదవండి: అర్జున్‌ టెండూల్కర్‌ బ్యాటింగ్‌ మెరుపులు..సిక్సర్ల మోత

చదవండిఇప్పుడేమంటారు: అశ్విన్‌ భార్య

మరిన్ని వార్తలు