ఇదేందయ్యా ఇది.. టాస్‌ గెలిస్తేనే ఇంత పని చేస్తావా..?

23 Jul, 2021 17:23 IST|Sakshi

కొలంబో: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టాస్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సిరీస్‌లో వరుసగా రెండు సార్లు టాస్ ఓడిన టీమిండియా కెప్టెన్ శిఖర్ ధవన్ ఆఖరి మ్యాచ్‌లో టాస్ గెలవడంతో ఆనందం పట్టలేక తొడ కొట్టి తన ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్స్‌ చేసుకున్నాడు. ధవన్ సెలెబ్రేషన్స్‌కు లంక కెప్టెన్ డసన్ షనకతో పాటు మ్యాచ్ రిఫరి, కామెంటేటర్లు పగలబడి నవ్వారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. టాస్ గెలిచినందుకే ఇంత హడావిడా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇదేందయ్యా ఇది.. టాస్‌ గెలిస్తేనే ఇంత పని చేస్తావా..? అంటూ అభిమానులు సరదా వ్యాఖ్యలు చేశారు.

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గబ్బర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోవడంతో ఈ మ్యాచ్‌లో బెంచ్ బలగానికి అవకాశం ఇస్తున్నామని తెలిపాడు. దాంతో జట్టులో ఆరు మార్పులు చోటు చేసుకున్నాయని.. మొత్తం ఐదుగురు క్రికెటర్లు అరంగేట్రం చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. నవదీప్ సైనీతో పాటు అరంగేట్ర ఆటగాళ్లు సంజూ శాంసన్, నితీష్ రానా, కృష్ణప్ప గౌతమ్ చేతన్ సకారియా, రాహుల్ చాహర్ అవకాశం దక్కించుకున్నారన్నారు. 

ఇదిలా ఉంటే, తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్‌ ధవన్‌(13) తక్కువ స్కోర్‌కే అవుటయ్యాడు. అనంతరం పృథ్వీ షా(49), సంజూ సామ్సన్‌(46) కాసేపు నిలకడగా ఆడి జట్టు స్కోర్‌ను 100 పరుగుల మార్కు దాటించారు. అయితే 16 పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరూ ఔట్‌ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. అయితే మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్లు మనీశ్‌ పాండే(15 బంతుల్లో 10), సూర్యకుమార్‌ యాదవ్‌(17 బంతుల్లో 22; 4 ఫోర్లు) నిలకడగా ఆడుతూ స్కోర్‌ బోర్డును ముందుకు తీసుకెళ్తున్న సమయంలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి టీమిండియా 23 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. లంక బౌలర్లలో శనక, జయవిక్రమ, చమీరా తలో వికెట్‌ పడగొట్టారు. 

మరిన్ని వార్తలు