హలో ఆస్ట్రేలియా

13 Nov, 2020 04:41 IST|Sakshi
బుమ్రా. రహానే ఫ్యామిలీ

ఆసీస్‌ గడ్డపై భారత బృందం

14 రోజుల క్వారంటీన్‌ షురూ  

సిడ్నీ: భారత క్రికెట్‌ బృందం ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టింది. ప్రత్యేక విమానంలో దుబాయ్‌నుంచి వెళ్లిన జట్టు సభ్యులు నేరుగా సిడ్నీకి చేరుకున్నారు. టీమిండియా సభ్యులతో పాటు ఐపీఎల్‌లో ఆడిన ఆసీస్‌ ఆటగాళ్లు స్మిత్, వార్నర్, కమిన్స్‌ తదితరులు కూడా గురువారమే స్వదేశం చేరారు. వీరందరిని స్థానిక అధికారులు  సిడ్నీ ఒలింపిక్‌ పార్క్‌ ప్రాంతానికి పంపించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటీన్‌ కోసం వీరంతా అక్కడి పూర్తి బయో సెక్యూర్‌ వాతావరణంలో ఉన్న ‘పుల్‌మ్యాన్‌’ హోటల్‌లో బస చేశారు.

క్రికెటర్ల కోసమే ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న స్థానిక రగ్బీ టీమ్‌ న్యూసౌత్‌వేల్స్‌ బ్లూస్‌ జట్టును అక్కడినుంచి తరలించారు. హోటల్‌లో ఆటగాళ్లను మినహా ఎలాంటి అతిథులను అనుమతించడం లేదు. ‘పుల్‌మ్యాన్‌’ హోటల్‌లో విరాట్‌ కోహ్లి కోసం ప్రత్యేక పెంట్‌ హౌస్‌ సూట్‌ను కేటాయించారు. క్వారంటీన్‌ సమయంలోనే జట్టు ప్రాక్టీస్‌ చేసుకునేందుకు మాత్రం అధికారులు అనుమతినిచ్చారు. ఆటగాళ్లు సాధన చేయాల్సిన బ్లాక్‌టౌన్‌ ఇంటర్నేషనల్‌ స్పోర్ట్‌ పార్క్‌ను కూడా బయో బబుల్‌ సెక్యూరిటీలో సిద్ధం చేశారు. ప్రాక్టీస్‌ కోసం మాత్రమే క్రికెటర్లు తమ హోటల్‌ గదులు వీడి బయటకు రావాల్సి ఉంటుంది. టీమిండియా సభ్యులలో కొందరి కోసం పరిమిత సంఖ్యలో కుటుంబసభ్యులు వచ్చేందుకు ఆస్ట్రేలియా అంగీకరించింది. రహానే, అశ్విన్‌ తమ కుటుంబాలతో అక్కడికి వెళ్లారు.  

కొత్త జెర్సీలతో...
ఆస్ట్రేలియాతో వన్డే, టి20 సిరీస్‌ల కోసం భారత జట్టు పాత రోజులను గుర్తుకు తెచ్చే (రెట్రో) రంగు జెర్సీలతో బరిలోకి దిగనుందని సమాచారం. ఇది 1992 వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు ధరించిన కిట్‌ను పోలి ఉంది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు