టైటిల్‌ కార్ల్‌సన్‌కు... ప్రశంసలు ప్రజ్ఞానందకు

25 Aug, 2023 02:58 IST|Sakshi

ప్రపంచకప్‌ చెస్‌ టోర్నీ రన్నరప్‌గా భారత గ్రాండ్‌మాస్టర్‌

తొలిసారి ప్రపంచకప్‌ టైటిల్‌ నెగ్గిన నార్వే చెస్‌ దిగ్గజం

గత దశాబ్దకాలంగా పురుషుల చెస్‌లో మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు ఎదురులేదు. ఈ నార్వే సూపర్‌స్టార్‌ క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్‌ ఫార్మాట్‌లలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. చెస్‌లో అత్యుత్తమ రేటింగ్‌ కూడా అందుకున్నాడు. అయితే అగ్రశ్రేణి చెస్‌ ఆటగాళ్ల మధ్య రెండేళ్లకోసారి నాకౌట్‌ పద్ధతిలో జరిగే ప్రపంచకప్‌ టో ర్నీలో మాత్రం కార్ల్‌సన్‌ శిఖరాన నిలువలేకపోయాడు. ఈసారి మాత్రం నిలకడైన ఆటతీరుతో కార్ల్‌సన్‌ తన కెరీర్‌లో తొలిసారి ప్రపంచకప్‌ టైటిల్‌ను సాధించాడు.

కార్ల్‌సన్‌కు టైటిల్‌ దక్కినా అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానందనే. తన అసమాన పోరాటపటిమతో... ఊహకందని ఎత్తులతో... తనకంటే ఎంతో మెరుగైన ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తూ... తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల ఈ టీనేజర్‌ రెండో ప్రయత్నంలోనే ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరాడు. కార్ల్‌సన్‌కు ఆద్యంతం గట్టిపోటీనిచ్చాడు. అనుభవలేమితో తుది మెట్టుపై తడబడ్డా... భవిష్యత్‌లో ప్రపంచ చాంపియన్‌ అయ్యే లక్షణాలు తనలో పుష్కలంగా ఉన్నాయని ప్రజ్ఞానంద చాటుకున్నాడు.   

బాకు (అజర్‌బైజాన్‌): ఇన్నాళ్లూ భారత చెస్‌ అంటే ముందుగా విశ్వనాథన్‌ ఆనంద్‌ పేరు గుర్తుకొచ్చేది. కానీ ఇక నుంచి ఆనంద్‌తోపాటు తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద పేరు కూడా అభిమానుల మదిలో మెదులుతుంది. గత 25 రోజులుగా అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో జరిగిన ప్రపంచకప్‌ టో ర్నీలో ఆరంభం నుంచి మేటి ఆటగాళ్లను మట్టికరిపించిన ఈ తమిళనాడు కుర్రాడు తుదిపోరులో నార్వే దిగ్గజం మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను బోల్తా కొట్టించలేకపోయాడు.

నిర్ణీత రెండు క్లాసికల్‌ గేముల్లో ప్రజ్ఞానంద నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొని ‘డ్రా’తో సంతృప్తి పడ్డ 32 ఏళ్ల కార్ల్‌సన్‌ టైబ్రేక్‌లోని ర్యాపిడ్‌ గేముల్లో తన అనుభవాన్నంతా ఉపయోగించి గట్టెక్కాడు. తొలి గేమ్‌లో నల్ల పావులతో ఆడిన కార్ల్‌సన్‌ 47 ఎత్తుల్లో ప్రజ్ఞానందపై గెలుపొంది... రెండో గేమ్‌లో తెల్ల పావులతో ఆడి 22 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని ఓవరాల్‌గా 2.5–1.5తో విజయాన్ని ఖరారు చేసుకున్నాడు.

ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన కార్ల్‌సన్‌ 156 మంది ఆటగాళ్ల మధ్య నాకౌట్‌ పద్ధతిలో నిర్వహించే ప్రపంచకప్‌ టోర్నీలో మాత్రం తొలిసారి విజేతగా నిలిచాడు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఫాబియానో కరువానా (అమెరికా) 3–1తో నిజాత్‌ అబసోవ్‌ (అజర్‌బైజాన్‌)పై గెలిచాడు.  

విజేతగా నిలిచిన కార్ల్‌సన్‌కు 1,10,000 డాలర్లు (రూ. 90 లక్షలు), రన్నరప్‌ ప్రజ్ఞానందకు 80 వేల డాలర్లు (రూ. 66 లక్షలు), మూడో స్థానం పొందిన కరువానాకు 60 వేల డాలర్లు (రూ. 49 లక్షలు)... నాలుగో స్థానంలో నిలిచిన అబసోవ్‌కు 50 వేల డాలర్లు (రూ. 41 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

ఈ ప్రపంచకప్‌ టోర్నీలో టాప్‌–3లో నిలిచిన ముగ్గురు ప్లేయర్లు వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్‌ టోర్నీకి అర్హత సాధించారు. తనకు సరైన పోటీనిచ్చే వారు లేకపోవడంతో ప్రపంచ చాంపియన్‌íÙప్‌లో పాల్గొనే ఆసక్తి లేదని గత ఏడాది ప్రకటించిన కార్ల్‌సన్‌ క్యాండిడేట్‌ టో ర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దాంతో రన్నరప్‌ ప్రజ్ఞానంద, కరువానా, అబసోవ్‌ క్యాండిడేట్‌ టో ర్నీకి అర్హత పొందారు. క్యాండిడేట్‌ టోర్నీ విజేత ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ (చైనా)తో ప్రపంచ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌ ఆడతారు.  

ఒక్కో రౌండ్‌ దాటి...  
2019 ప్రపంచకప్‌లో తొలిసారి బరిలోకి దిగిన ప్రజ్ఞానంద నాలుగో రౌండ్‌లో వెనుదిరిగాడు. ఈసారి మాత్రం ఈ తమిళనాడు కుర్రాడు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ఈ టోర్నీ చరిత్రలో ఫైనల్‌ చేరిన రెండో భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్‌ నుంచి ఓపెన్‌ విభాగంలో పది మంది గ్రాండ్‌మాస్టర్లు పోటీపడగా ఒకరు ఫైనల్‌కు, మరో ముగ్గురు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరడం విశేషం.  

2690 రేటింగ్‌తో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 29వ స్థానంలో ఉన్న ప్రజ్ఞానందకు తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది.  
♦ రెండో రౌండ్‌లో 2599 రేటింగ్‌ ఉన్న ఫ్రాన్స్‌ గ్రాండ్‌మాస్టర్‌ మాక్సిమి లగార్డె (ఫ్రాన్స్‌)పై 1.5–0.5తో గెలిచాడు. 
♦ మూడో రౌండ్‌లో చెక్‌ రిపబ్లిక్‌ గ్రాండ్‌మాస్టర్, 2689 రేటింగ్‌ ఉన్న డేవిడ్‌ నవారా (చెక్‌ రిపబ్లిక్‌)ను ప్రజ్ఞానంద ఓడించాడు. 
♦ నాలుగో రౌండ్‌లో ప్రజ్ఞానంద ప్రపంచ రెండో ర్యాంకర్, 2787 రేటింగ్‌ ఉన్న హికారు నకముర (అమెరికా)పై టైబ్రేక్‌లో 3–1తో సంచలన విజయం సాధించాడు. 
♦ ఐదో రౌండ్‌లో 1.5–0.5తో ఫెరెంక్‌ బెర్కెస్‌ (హంగేరి)పై గెలిచాడు.  
♦ క్వార్టర్‌ ఫైనల్లో ప్రజ్ఞానంద భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్, 2710 రేటింగ్‌ ఉన్న ఇరిగేశి అర్జున్‌పై టైబ్రేక్‌లో 5–4తో సంచలన విజయం సాధించాడు.  
♦ ప్రపంచ మూడో ర్యాంకర్, 2782 రేటింగ్‌ ఉన్న ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన సెమీఫైనల్లో ప్రజ్ఞానంద టైబ్రేక్‌లో 3.5–2.5తో గెలుపొంది ఫైనల్‌ చేరాడు.   

మరిన్ని వార్తలు