Hyderabad Cricket Association: కథ కంచికి.. హెచ్‌సీఏకు తగిన శాస్తి 

14 Feb, 2023 19:30 IST|Sakshi

వెంకటపతిరాజు, మహ్మద్‌ అజారుద్దీన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్.. ఇలా ఆణిముత్యం లాంటి క్రికెటర్లను దేశానికి అందించిన ఘనత హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ది(హెచ్‌సీఏ). అలాంటి హెచ్‌సీఏ ఇవాళ అంతర్గత కుమ్ములాటలు, చెత్త రాజకీయాలతో భ్రష్టు పట్టిపోయింది. ఇంత జరుగుతున్నా బీసీసీఐ ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. హెచ్‌సీఏ వ్యవహార కమిటీని రద్దు చేస్తూ సుప్రీం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ఏకసభ్య కమిటీ హెచ్‌సీఏ వ్యవహరాలను చూసుకుంటుందని తెలిపింది. ఇన్నాళ్లుగా ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూ వచ్చిన హెచ్‌సీఏ కథ చివరికి ఇలా ముగిసింది.

టాలెంటెడ్‌ ఆటగాళ్లను పట్టించుకోకుండా ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే వారినే ఆడించడం హెచ్‌సీఏలో కామన్‌గా మారిపోయింది. ఇటీవలే ముగిసిన రంజీ ట్రోఫీలోనూ హైదరాబాద్‌ జట్టు దారుణ ప్రదర్శనను కనబరిచింది. నాలుగు రోజుల మ్యాచ్‌ల్లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి నిండా ఒక్కరోజు కూడా పూర్తిగా బ్యాటింగ్‌ చేయలేక.. సరిగా బౌలింగ్‌ చేయలేక చేతులెత్తేస్తున్నారు. టోర్నీలో ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో పరాజయం.. ఒక మ్యాచ్‌ డ్రాతో ఒక్క పాయింటుతో గ్రూప్‌-బి పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.

రంజీలో పాల్గొన్న మిగతా రాష్ట్రాల జట్లు ఆటలో ముందుకు వెళుతుంటే.. హెచ్‌సీఏ మాత్రం మరింత వెనక్కి వెళుతుంది. పాలకుల అవినీతి పరాకాష్టకు చేరడమే హైదరాబాద్‌ క్రికెట్‌ దుస్థితికి ప్రధాన కారణమన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక టీమిండియా, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన టి20 మ్యాచ్‌కు టికెట్ల అమ్మకంపై జరిగిన రగడ హెచ్‌సీఏలోని అంతర్గత విబేధాలను మరోసారి బహిర్గతం చేసింది.

హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజారుద్దీన్‌ సహా మిగతా కార్యవర్గ సభ్యులు మధ్య తలెత్తిన విబేధాలతో ఆటను సరిగా పట్టించుకోవడం లేదని భావించిన సుప్రీం కోర్టు పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసింది. హెచ్‌సీఏ వ్యవహారాల పర్యవేక్షణకు జిస్టిస్‌ కక్రూ, డీజీపీ అంజనీ కుమార్‌, వెంకటపతిరాజు, వంకా ప్రతాప్‌లతో తాత్కాలిక కమిటీని నియమించింది. అయినప్పటికి ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగా హెచ్‌సీఏ పరిస్థితి ఉంది. పైగా వంకా ప్రతాప్‌ కమిటీ బాధ్యతల్లోనే గాకుండా జట్టు సెలక్షన్‌ కమిటీలోనూ వేలు పెడుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి.

హెచ్‌సీఏ అకాడమీ డైరెక్టర్‌గా వంకా ప్రతాప్‌ నెలకు రూ. 3 లక్షలు జీతం తీసుకుంటున్నప్పటికి.. పర్యవేక్షక కమిటీకి హాజరైనందున తనకు రూ. 5.25 లక్షలు ఇవ్వాలని హెచ్‌సీఏకు విజ్ఞప్తి చేశాడు. తన స్వప్రయోజనాల కోసం హెచ్‌సీఏను వంకా ప్రతాప్‌ భ్రష్టు పట్టిస్తున్నారని కొంతమంది పేర్కొన్నారు. మాజీ ఆటగాళ్లు పరిపాలకులుగా ఉంటే హెచ్‌సీఏ కాస్త గాడిన పడుతుందని భావించారు. కానీ తాజా రాజకీయ పరిణామాలు సగటు క్రికెట్‌ అభిమానులను ఆవేదన కలిగించాయి. ఇంత జరుగుతున్నా బీసీసీఐ నిమ్మకు నీరెత్తనట్టుగా ఉండడం సగటు అభిమానిని ఆశ్చర్యానికి గురి చేసింది.

త్వరలో హెచ్‌సీఏ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఎన్నికలు సజావుగా జరగాలని కొంతమంది హెచ్‌సీఏ ప్రతివాదులు సుప్రీంను ఆశ్రయించారు.  దీంతో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) కథ కంచికి చేరింది. సుప్రీంకోర్టు హెచ్‌సీఏ వ్యవహార కమిటీని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఇకపై ఏకసభ్య కమిటీ హెచ్‌సీఏ వ్యవహారలన్నీ చూసుకుంటుందని సుప్రీం పేర్కొంది.

చదవండి: అజారుద్దీన్‌కు చుక్కెదురు.. హెచ్‌సీఏ కమిటీని రద్దు చేసిన సుప్రీం కోర్టు

మరిన్ని వార్తలు