Sanket Mahadev Sargar: నాలుగేళ్ల కిందటి హామీ.. పతకధారిగా ‘పాన్‌వాలా’

31 Jul, 2022 07:20 IST|Sakshi

నాలుగేళ్ల క్రితం... గోల్డ్‌కోస్ట్‌లో కామన్వెల్త్‌ క్రీడలు జరుగుతున్నాయి. వెయిట్‌లిఫ్టింగ్‌లో గురురాజ పుజారి పోటీ పడుతున్నాడు. తన ‘పాన్‌ షాప్‌’లో కూర్చొని ఈ ఈవెంట్‌ను సంకేత్‌ టీవీలో చూస్తున్నాడు. గురురాజ 56 కేజీల విభాగంలో రజతం సాధించాడు. ఆ సమయంలో సంకేత్‌ ‘నాలుగేళ్ల తర్వాత ఎలాగైనా నేనూ అక్కడికి వెళతాను. కష్టపడి కచ్చితంగా పతకం సాధిస్తాను’ అని తనకు తాను చెప్పుకున్నాడు. నిజంగానే అతను తన కల నెరవేర్చుకున్నాడు.

2013 నుంచి వెయిట్‌లిఫ్టింగ్‌లో ఉన్న ఆ కుర్రాడు ఇప్పుడు 22 ఏళ్ల వయసులో కామన్వెల్త్‌ పతకంతో సత్తా చాటాడు. మహారాష్ట్రలోని సాంగ్లీలో సంకేత్‌ తండ్రికి పాన్‌షాప్‌తో పాటు చిన్నపాటి టిఫిన్‌ సెంటర్‌ కూడా ఉంది. మొదటినుంచి తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూనే అతను ఆటపై దృష్టి పెట్టాడు. క్రీడలపై ఆసక్తి ఉన్న తండ్రి ప్రోత్సాహంతో వెయిట్‌లిఫ్టింగ్‌ వైపు నడిచాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లో వచ్చే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురైనా తండ్రి మహదేవ్‌ ఎప్పుడూ సంకేత్‌ను నిరుత్సాహపర్చలేదు.

ఒక వైపు వెయిట్‌లిఫ్టర్‌గా గుర్తింపు వస్తున్న సమయంలో సంకేత్‌ కూడా ఏనాడూ పాన్‌షాప్‌లో కూర్చొని పని చేయడాన్ని తక్కువగా భావించలేదు. 2020లో కోల్‌కతాలో జరిగిన సీనియర్‌ నేషనల్స్‌లో సంకేత్‌ తొలిసారి స్వర్ణం గెలిచి అందరి దృష్టిలో పడ్డాడు. ఇదే ఏడాది సింగపూర్‌లో మొత్తం 256 కేజీల బరువు ఎత్తడంతో కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనే అర్హత లభించింది.

ఫిబ్రవరిలో పటియాలలోని నేషనల్‌ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం లభించిన తర్వాత హెడ్‌ కోచ్‌ విజయ్‌ శర్మ పర్యవేక్షణలో మరింతగా రాటుదేలిన సంకేత్‌ ఇప్పుడు తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ‘ఇప్పటి వరకు అంతా సంకేత్‌ పాన్‌వాలా అని పిలిచేవారు. ఇప్పుడు కామన్వెల్త్‌ క్రీడల పతక విజేత సంకేత్‌ పాన్‌వాలా అని పిలుస్తారేమో’ అని ఉద్వేగంగా చెప్పాడు. సోదరుడి బాటలో వెయిట్‌లిఫ్టింగ్‌లో అడుగు పెట్టిన అతను చెల్లెలు కాజల్‌ ఇటీవలే ఖేలో ఇండియా గేమ్స్‌లో 40 కేజీల విభాగంలో స్వర్ణం గెలవడం విశేషం.

మరిన్ని వార్తలు