IPL 2022: బుడగ దాటితే బంతాటే..! కఠినమైన బయోబబుల్‌ రూల్స్‌ను అమల్లోకి తేనున్న బీసీసీఐ

16 Mar, 2022 20:35 IST|Sakshi

IPL 2022 Bio Bubble Rules: మరో పది రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ 15వ సీజన్ కోసం బీసీసీఐ కఠినమైన బయో బబుల్ నిబంధనలను సిద్ధం చేసింది. కోవిడ్‌ నేపథ్యంలో గతేడాది అనుభవాల దృష్ట్యా ఈసారి రూల్స్‌ను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరించింది. ఎవరైనా ఆటగాడు బుడగ దాటితే తొలిసారికి ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్, రెండో ఉల్లంఘనకు ఓ మ్యాచ్ నిషేధం, మూడోసారి బుడగ దాటితే ఏకంగా లీగ్‌ నుంచే గెంటివేత తప్పదని గట్టిగా హెచ్చరించింది. ఈ పరిస్థితి ఎదురైతే, ప్రత్యామ్నాయ ఆటగాడిని కూడా అనుమతించరని పేర్కొంది. 

ఇక, ఫ్రాంచైజీల విషయానికొస్తే.. ఎవరైనా ఆటగాడు/ ఫ్రాంచైజీ సభ్యుడు తొలిసారి బుడగ దాటితే సదరు ఫ్రాంచైజీకి రూ. కోటి జరిమానా, రెండో సారి ఇదే జరిగితే ఒక పాయింట్ కోత, మూడో సారికైతే రెండు పాయింట్ల కోత ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. బయోబబుల్‌ నిబంధనలు ఫ్రాంచైజీలు, సభ్యుల వరకే కాకుండా వారి కుటుంబాలకు కూడా ఉంటాయని.. కుటుంబ సభ్యుల మొదటి ఉ‍ల్లంఘనకు ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ (ఉల్లంఘించిన వారికి సంబంధించిన ఆటగాడు కూడా ఏడు రోజుల క్వారంటైన్‌లో గడపాల్సిందే), రెండో సారికి బుడగ నుంచి తొలగిస్తారని వివరించింది. దీంతో పాటు కోవిడ్ టెస్ట్‌కు నిరాకరించే వ్యక్తులకు తొలిసారి మందలింపు, రెండోసారికి రూ. 75వేల జరిమానాతో పాటు స్టేడియంలోకి అనుమతి నిరాకరణ ఉంటుందని బీసీసీఐ పేర్కొంది.  
చదవండి: ఐపీఎల్‌లో సరికొత్త రూల్స్‌.. ఇకపై!

మరిన్ని వార్తలు