IPL 2024: రూ. 15 కోట్లు కాదు! అంత‌కు మించి.. అశూ కీల‌క వ్యాఖ్య‌లు

29 Nov, 2023 15:14 IST|Sakshi
రోహిత్ శ‌ర్మ‌తో హార్దిక్ పాండ్యా (PC: IPL/BCCI)

IPL 2024- Hardik Pandya: ఐపీఎల్-2024 వేలం నేప‌థ్యంలో హార్దిక్ పాండ్యా ఫ్రాంఛైజీ మార్పు గురించి క్రీడావ‌ర్గాల్లో చ‌ర్చ కొన‌సాగుతూనే ఉంది. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్‌గా విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న ఈ స్టార్ ఆల్‌రౌండ‌ర్ అకస్మాత్తుగా ముంబై ఇండియన్స్లో తిరిగి చేర‌డం సంచ‌ల‌నంగా మారింది. రూ. 15 కోట్ల విలువైన ఆట‌గాడు ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఖ‌రీదైన‌ ట్రేడింగ్‌గా నిలిచింది.

ఈ నేప‌థ్యంలో టీమిండియా వెట‌ర‌న్ స్పిన్న‌ర్‌ ర‌విచంద్ర‌న్ అశ్విన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ట్రేడింగ్ ద్వారా ఐపీఎల్ జట్టు మారిన ఆట‌గాడికి అందే మొత్తం ఎంత ఉంటుందో వివ‌రించే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ మేర‌కు త‌న యూట్యూబ్ చానెల్ వేదిక‌గా మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ ట్రేడ్ డీల్ ఎలా ఉంటుందో మీకు చెప్పడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. గతంలో నేను కూడా ఇలాగే జట్టు మారిన వాడినే.

ట్రేడింగ్ సమయంలో ఓ ఆటగాడు ఎంత మొత్తానికైతే మారుతున్నాడో అందులో పది నుంచి 50% వరకు పొందుతాడు. ఉదాహరణకు.. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి 15 కోట్ల రూపాయలకు ట్రేడ్ చేసుకున్నట్లు చెబుతోంది. ఇలాంటి సందర్భాల్లో ఆటగాడిని ఆయా ప్రాంచేజీలు తమ కమోడిటీగా భావిస్తాయి.

అందుకోసం కాంట్రాక్ట్ చేసుకున్న మొత్తం చెల్లిస్తాయి. అయితే ప్లేయర్కు అదనంగా ఇంకొంత మొత్తం కూడా అందజేస్తాయి. ఈ విషయాన్ని మాత్రం బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ట్రేడింగ్ చేసుకున్న ఫ్రాంచైజీలు, ఆటగాడికి మధ్య ఉన్న అంతర్గత వ్యవహారం’’ అని అశ్విన్ పేర్కొన్నాడు.

తొలుత ర‌హానే..
కాగా.. క్యాష్ రిచ్ లీగ్‌లో ట్రేడింగ్‌ రూపంలో ఫ్రాంచైజీ మారిన తొలి కెప్టెన్‌  అజింక్యా రహానే. ఐపీఎల్‌-2020 సీజన్‌కు ముందు ఈ వెట‌రన్ బ్యాట‌ర్ రాజ‌స్తాన్‌ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ట్రేడ్ అయ్యాడు. ఐపీఎల్‌-2011లో రాజస్తాన్‌ రాయల్స్‌కు రహానే  కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

ర‌హానే త‌ర్వాత .. ఈ లిస్ట్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఉన్నాడు. ఐపీఎల్‌-2020కు ముందు పంజాబ్‌ కింగ్స్‌ నుంచి అశ్విన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ ట్రేడింగ్‌ ద్వారానే సొంతం చేసుకుంది. 

మరిన్ని వార్తలు