-

IPL 2024: 10 లక్షల నుంచి 15 కోట్లకు.. అయినా సంతృప్తి లేదా..?

28 Nov, 2023 11:28 IST|Sakshi

ఐపీఎల్‌ 2024 సీజన్‌కు సంబంధించి ఇటీవల జరిగిన ఆసక్తికర పరిణామాల్లో హార్దిక్‌ పాండ్యా గుజరాత్‌ టైటాన్స్‌ను వీడి తన సొంతగూడు అయిన ముంబై ఇండియన్స్‌కు చేరాడు. ముంబై ఇండియన్స్‌ ట్రేడింగ్‌ ద్వారా హార్దిక్‌ను గుజరాత్‌ నుంచి బదిలీ చేసుకుంది. ఇందుకు గాను ముంబై యాజమాన్యం గుజరాత్‌ ఫ్రాంచైజీకి భారీ మొత్తం చెల్లించేందుకు (హార్దిక్‌ రెమ్యూనరేషన్‌ 15 కోట్లకు అదనంగా) అంగీకరించిందని తెలుస్తుంది. 

ఇ​క్కడి వరకు అంతా బాగానే ఉంది. ఆటగాళ్లు, కెప్టెన్లు ట్రేడింగ్‌ ద్వారా ఫ్రాంచైజీలు మారడం ఐపీఎల్‌లో కొత్తేమీ కాదు. అయితే అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు (అరంగేట్రం చేసిన తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌, రెండో సీజన్‌లో రన్నరప్‌) హార్దిక్‌ ఫ్రాంచైజీ ఎందుకు మారాడన్నదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. 

హార్దిక్‌కు, గుజరాత్‌ యాజమాన్యానికి రెమ్యూనరేషన్‌ విషయంలో విభేదాలు తలెత్తాయని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ.. జనాలు ఈ విషయాన్ని నమ్మడం లేదు. ఏదో బలమైన కారణంగానే హార్దిక్‌ గుజరాత్‌ను వీడాడని చర్చించుకుంటున్నారు. కారణం​ ఏదైనా డబ్బు కోసమే హార్దిక్‌ గుజరాత్‌ను వీడాడని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. హార్దిక్‌ వ్యతిరేకులు ఈ అంశాన్ని పావుగా వాడుకుని మరింత దుష్ప్రచారానికి దిగుతున్నారు.

డబ్బు కోసం హార్దిక్‌ ఎంతకైనా దిగజారుతాడని, ఏదో ఒక రోజు ఇదే డబ్బు కోసం జాతీయ జట్టుకు ఆడటం​ కూడా మానేస్తాడని కామెంట్లు చేస్తున్నారు. కష్టకాలంలో (పేలవ ఫామ్‌లో) ఉన్నప్పుడు పిలిచి కెప్టెన్సీ ఇస్తే ఆ ఫ్రాంచైజీనే ఇప్పుడు వెన్నుపోటు పొడిచాడంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. 2015 ఐపీఎల్‌ సీజన్‌లో 10 లక్షలతో ప్రారంభమైన ప్రస్తానం ఇప్పుడు 15 కోట్లకు చేరినప్పటికీ అతనికి సంతృప్తి లేదని అంటున్నారు. 

ఐపీఎల్‌ అరంగేట్రం నుంచి హార్దిక్‌ రెమ్యూనరేషన్‌..

  • 2015 ఎడిషన్‌ (ముంబై ఇండియన్స్‌)- 10 లక్షలు
  • 2016 ఎడిషన్‌ (ముంబై ఇండియన్స్‌)- 10 లక్షలు
  • 2017 ఎడిషన్‌ (ముంబై ఇండియన్స్‌)- 10 లక్షలు
  • 2018 ఎడిషన్‌ (ముంబై ఇండియన్స్‌)- 11 కోట్లు
  • 2019 ఎడిషన్‌ (ముంబై ఇండియన్స్‌)- 11 కోట్లు
  • 2020 ఎడిషన్‌ (ముంబై ఇండియన్స్‌)- 11 కోట్లు
  • 2021 ఎడిషన్‌ (ముంబై ఇండియన్స్‌)- 11 కోట్లు
  • 2022 ఎడిషన్‌ (గుజరాత్‌ టైటాన్స్‌‌)- 15 కోట్లు
  • 2023 ఎడిషన్‌ (గుజరాత్‌ టైటాన్స్‌‌)- 15 కోట్లు
  • 2024 ఎడిషన్‌ (ముంబై ఇండియన్స్‌)- 15 కోట్లు
మరిన్ని వార్తలు