కోహ్లిని మూడుసార్లు ఔట్‌ చేసేసరికి..

27 Jul, 2020 16:03 IST|Sakshi

కరాచీ: ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పి తనదైన మార్కుతో దూసుకుపోతున్న టీ​మిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని తక్కువ అంచనా వేశానని పాకిస్తాన్‌ వెటరన్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌ జునైద్‌ ఖాన్‌ తెలిపాడు. 2012లో పాకిస్తాన్‌తో సిరీస్‌లో కోహ్లిని మూడుసార్లు ఔట్‌ చేయడంతో అతనిపై ఎటువంటి అంచనాలు లేవన్నాడు. భారత్‌లో జరిగిన ఆ సిరీస్‌లో కోహ్లి 13 పరుగులు మాత్రమే చేశాడు. కాగా, ఆ సిరీస్‌లో జునైద్‌ 24 బంతుల్ని కోహ్లి సంధించగా మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. చెన్నై మ్యాచ్‌లో డకౌట్‌ అయిన కోహ్లి.. కోల్‌కతా, ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా ఆరు, ఏడు పరుగులు చేశాడు. దాంతో ఆ సిరీస్‌ కోహ్లికి నిరాశనే మిగిల్చగా, పాకిస్తాన్‌ 2-1తో సిరీస్‌ గెలుచుకుంది. (‘సురేశ్‌ రైనా కెరీర్‌ ముగిసినట్లే’)

ఈ సిరీస్‌కు సంబంధించి క్రిక్‌ఇన్‌జిఫ్‌ యూట్యూబ్‌ చానల్‌లో జునైద్‌ మాట్లాడాడు. కాగా, ప్రత్యేకంగా కోహ్లిని ఔట్‌ చేయడంపై సదరు వ్యాఖ్యాత ప్రశ్నించగా జునైద్‌ దానికి బదులిచ్చాడు. ‘ నేను కోహ్లిని సాధారణ బ్యాట్స్‌మన్‌ అనుకున్నా. నేను కోహ్లికి వేసిన మొదటి బంతి వైడ్‌ అయ్యింది. ఆ తదుపరి బంతిని కోహ్లి ఆడలేకపోవడమే కాకుండా ఔట‍య్యాడు. దాంతో అతన్ని మామూలు బ్యాట్స్‌మన్‌గానే భావించా. ఇక ఆ సిరీస్‌కు ముందు కోహ్లి నాతో చాలెంజ్‌ చేశాడు. ఇవి భారత్‌ పిచ్‌లు నువ్వు వేసే బంతులు వల్ల ఏమీ ఉపయోగం ఉండదని జోక్‌ చేశాడు. నేను కూడా చూద్దాం అని సరదాగా రిప్లై ఇచ్చా’ అని జునైద్‌పేర్కొన్నాడు. ఆ సమయంలో పాకిస్తాన్‌ జట్టులో రెగ్యులర్‌ ఆటగాడైన జునైద్‌.. అత్యుత్తమ ప్రదర్శనపైనే ఎక్కువ గురిపెట్టేవాడు. ప్రత్యేకంగా భారత్‌పై మరింత చెలరేగి బౌలింగ్‌ వేసేవాడు జునైద్‌. 2012 సిరీస్‌లో జునైద్‌ మొత్తం ఎనిమిది వికెట్లు తీశాడు. తొలి వన్డేలో నాలుగు వికెట్లు సాధించిన జునైద్‌.. రెండో వన్డేలో మూడు వికెట్లు తీశాడు. గతేడాది మే నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో జునైద్‌ పాకిస్తాన్‌ తరఫున చివరిసారి కనిపించాడు.(ఐసీసీ వన్డే సూపర్‌ లీగ్‌ వచ్చేసింది..)

మరిన్ని వార్తలు