కోచ్‌గా నా బాధ్యత నిర్వర్తించడం తప్పా?

2 Feb, 2021 15:56 IST|Sakshi

బ్రిస్బేన్‌: ఆసీస్‌ యువ ఆటగాడు మార్నస్‌ లబుషేన్‌తో వివాదంపై ఆసీస్‌ ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ స్పందించాడు. గబ్బా వేదికగా జరిగిన నాలుగోటెస్టులో లబుషేన్‌ తన జేబులో సాండ్‌విచ్‌ తీసుకురావడంపై లాంగర్‌ అభ్యంతరం చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై ఆసీస్‌ జట్టులోని పలువురు ఆటగాళ్లు లాంగర్‌ ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. లాంగర్‌ ఒక స్కూల్‌ హెడ్‌మాస్టర్‌లాగా ప్రవర్తిస్తున్నాడని.. అతనితో తమకు పొసగడం లేదంటూ పరోక్ష్య వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సిడ్నీ హెరాల్డ్‌ పత్రిక ఆసీస్‌ జట్టులో విభేదాలు వచ్చాయని.. దీనికి కారణం లాంగర్‌ అంటూ పేర్కొంది. పత్రికలో వచ్చిన కథనంపై లాంగర్‌ స్పందిస్తూ.. అవన్నీ తప్పుడు కథనాలని.. వాటిలో నిజం లేదని తేల్చి చెప్పాడు.చదవండి: ఆసీస్‌ జట్టులో విభేదాలు.. కారణం అతనే!

అయితే తాజాగా తనను కనీసం సాండ్‌విచ్‌ కూడా తినడానికి అవకాశం ఇవ్వలేదంటూ లబుషేన్‌ పేర్కొనడంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో లాంగర్‌ మళ్లీ స్పందిస్తూ.. ' మ్యాచ్‌ సమయంలో లబుషేన్‌కు సాండ్‌విచ్‌ తినొద్దు అని మాత్రమే చెప్పా.. ఎందుకంటే అప్పటికే ఆటకు 40 నిమిషాల పాటు లంచ్‌ బ్రేక్‌ ఇచ్చారు.. అప్పుడు తినకుండా.. దానిని జేబులో పెట్టుకొని ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించాను. ఒక్క విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. కోచ్‌గా నా జట్టును ఉన్నతస్థానంలో​ నిలిపాలని ఆశిస్తుంటా. అందుకే కాస్త క్రమశిక్షణగా మెలిగి ఉండొచ్చు. అంతమాత్రానికే కొందరు ఆటగాళ్లు నన్ను తప్పుబడుతూ బ్యాడ్‌ చేయాలని చూస్తున్నారు.చదవండి: ధోనీ అరుదైన రికార్డు.. తొలి క్రికెటర్‌గా!

నేను చేసే పనులు కొందరికి నచ్చకపోవచ్చు.. కానీ కోచ్‌గా నా బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి.బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి ఎలాంటి వస్తువులు తీసుకురావడానికి అనుమతి లేదని క్రికెట్‌ ఆస్ట్రేలియా పేర్కొంది. అదే నిబంధనను నేను లబుషేన్‌ విషయంలో అమలు చేశాను. కొన్నిసార్లు నేను కోపంగా ప్రవర్తించి ఉండొచ్చు.. అలా అని ప్రతీసారి అదే విషయాన్ని గుర్తుచేస్తు తప్పుబట్టడం సరికాదు అంటూ చెప్పుకొచ్చాడు. కాగా 2018 బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం తర్వాత లాంగర్‌ ఆసీస్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికయిన సంగతి తెలిసిందే. కాగా టీమిండియాతో జరిగిన బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీని 2-1తేడాతో కోల్పోవడంపై ఆసీస్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.చదవండి: అతడి కెప్టెన్సీలో టీమిండియా స్వేచ్ఛగా ఆడుతుంది

>
మరిన్ని వార్తలు