పొలార్డ్‌ కుమ్మేశాడుగా..

30 Aug, 2020 18:43 IST|Sakshi

నైట్‌రైడర్స్‌ ‘సిక్సర్‌’

ట్రినిడాడ్‌: వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ కీరోన్‌ పొలార్డ్‌ వీరోచిత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.  కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో భాగంగా ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పొలార్డ్‌ బౌండరీల మోత మోగించి జట్టుకు గొప్ప విజయాన్ని అందించాడు. బార్బోడాస్‌ ట్రిడెంట్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్‌ 28 బంతుల్లో 9 సిక్సర్లు, 2 ఫోర్లతో 72 పరుగులు చేసి ఓటమి ఖాయమనుకున్న జట్టుకు విజయం సాధించిపెట్టాడు. ఇది కదా కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ అన్న చందంగా సాగిన పొలార్డ్‌ ఇన్నింగ్స్‌తో నైట్‌రైడర్స్‌ జట్టు రెండు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బార్బోడాస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 148 పరుగులు చేసింది. అనంతరం 149 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన నైట్‌రైడర్స్‌ 62 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. (చదవండి: రైనా నిష్క్రమణ.. వాట్సన్‌ ఆవేదన)

మరో 15 పరుగుల వ్యవధిలో లెండి సిమ్మన్స్‌(32) ఔట్‌ కావడంతో జట్టు భారం పొలార్డ్‌పై పడింది. తనపై పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టే ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పొలార్డ్‌ ఆది నుంచి బార్బోడాస్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కొడితే సిక్స్‌ అయినా కావాలి.. లేకపోతే ఫోర్‌ అయినా కావాలి అన్న విధంగా సాగింది పొలార్డ్‌ ఆట. పరిస్థితులకు తగ్గట్టు బ్యాట్‌ ఝుళిపిస్తూ నైట్‌రైడర్స్‌ స్కోరును పరుగులు పెట్టించాడు. 17 ఓవర్‌లో నాలుగు సిక్సర్లు కొట్టి ఒక్కసారిగా నైట్‌రైడర్స్‌లో ఊపుతెచ్చాడు. యువ ఆఫ్‌ స్పిన్నర్‌ హేడెన్‌ వాల్ష్‌ బౌలింగ్‌లో సిక్సర్లతో దుమ్మురేపాడు. ఆ తర్వాత ఓవర్‌లో రెండు బౌండరీలు కొట్టి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్‌ సెంచరీని 22 బంతుల్లో పూర్తి చేసుకున్న పొలార్డ్‌.. చివరి ఓవర్‌ రెండో బంతికి అనవసరపు పరుగు కోసం యత్నించి రనౌట్‌ అయ్యాడు.

అప్పటికి నైట్‌రైడర్స్‌ స్కోరు 141. దాంతో నైట్‌రైడర్స్‌ నాలుగు బంతుల్లో ఎనిమిది పరుగులు చేయాల్సి రావడంతో  ఖారీ పీర్‌ బ్యాట్‌కు పని చెప్పి ఇంకా బంతి ఉండగానే విజయంలో భాగమయ్యాడు. ఆ చివరి ఓవర్‌ మూడో బంతికి సీల్స్‌ సింగిల్‌ తీయగా, నాల్గో బంతిని పీర్‌ సిక్స్‌ కొట్టాడు. ఒక ఆఖరి బంతికి పీర్‌ సింగిల్‌ తీయడంతో నైట్‌రైడర్స్‌ గెలుపును అందుకుంది.  ఇది నైట్‌రైడర్స్‌కు వరుసగా ఆరో విజయం. ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోని నైట్‌రైడర్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు