IND Vs AUS: గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడిన రాహుల్; తొలి వన్డే టీమిండియాదే

17 Mar, 2023 20:54 IST|Sakshi

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 39.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కేఎల్‌ రాహుల్‌ (91 బంతుల్లో 75 పరుగులు నాటౌట్‌) తన కెరీర్‌ బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడగా.. జడేజా(69 బంతుల్లో 45 పరుగులు నాటౌట్‌) తన స్టైల్‌ ఇన్నింగ్స్‌తో మెప్పించాడు.

ఒక దశలో 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ దశలో కేఎల్‌ రాహుల్‌ ఆపద్భాందవుడి పాత్ర పోషించాడు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. ఈ దశలో జట్టు స్కోరు 89 పరుగులకు చేరగానే పాండ్యా(25 పరుగులు) ఔటయ్యాడు. కేఎల్‌ రాహుల్‌కు జడేజా తోడయ్యాడు.

ఇద్దరు కలిసి ఎలాంటి పొరపాటు చేయకుండా నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కేఎల్‌ రాహుల్‌ ఫిఫ్టీ పూర్తి చేసుకున్న తర్వాత కాస్త వేగం పెంచగా జడ్డూ అతనికి సహకరించాడు. ఇద్దరు కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 108 పరుగులు జోడించారు.  ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌ మూడు వికెట్లు తీయగా.. స్టోయినిస్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా పూర్తి ఓవర్లు ఆడకుండానే 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌట్‌ అయింది, మిచెల్‌ మార్ష్‌ 81 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. షమీ, సిరాజ్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. జడ్డూ రెండు, కుల్దీప్‌ , పాండ్యా చెరొక వికెట్‌ తీశారు. ఈ విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.  ఇరుజట్ల మధ్య రెండో వన్డే మార్చి 19న(ఆదివారం) విశాఖపట్నం వేదికగా జరగనుంది.

మరిన్ని వార్తలు