LLC 2023: ఉతప్ప ఊచకోత.. గంభీర్‌ గర్జన

15 Mar, 2023 09:39 IST|Sakshi

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ 2023 సీజన్‌లో ఇండియా మహారాజాస్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ప్రస్తుత ఎడిషన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన మహారాజాస్‌.. నిన్న (మార్చి 14) ఆసియా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన మహారాజాస్‌.. లయన్స్‌ను 157 పరుగులకు కట్టడి చేసింది.

ఉపుల్‌ తరంగ (48 బంతుల్లో 69; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలకరత్నే దిల్షన్‌ (27 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్‌), అబ్దుర్‌ రజాక్‌ (17 బంతుల్లో 27 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించడంతో లయన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లయన్స్‌ ఇన్నింగ్స్‌లో మహ్మద్‌ హఫీజ్‌ (2), కెప్టెన్‌ మిస్బా ఉల్‌ హాక్‌ (0), అస్ఘర్‌ అఫ్ఘాన్‌ (15) విఫలం కాగా.. మహారాజాస్‌ బౌలర్లలో సురేశ్‌ రైనా 2, స్టువర్ట్‌ బిన్నీ, హర్భజన్‌ సిం‍గ్‌, ప్రవీణ్‌ తాంబే తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించేం‍దుకు బరిలోకి దిగిన మహారాజస్‌.. వికెట్‌ కూడా నష్టపోకుం‍డానే విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు రాబిన్‌ ఉతప్ప (39 బంతుల్లో 88 నాటౌట్‌; 11 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ (36 బంతుల్లో 61 నాటౌట్‌; 12 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 12.3 ఓవర్లలోనే ఇండియా మహారాజాస్‌ విజయం సాధించారు.

లయన్స్‌ బౌలర్లను ఉతప్ప ఊచకోత కోయగా, గంభీర్‌ ప్రత్యర్ధి బౌలర్లపై సింహగర్జన చేశాడు. గంభీర్‌కు ఈ సీజన్‌లో ఇది వరుసగా 3వ హాఫ్‌ సెంచరీ కావడం​ విశేషం. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లో ఇవాళ (మార్చి 15) వరల్డ్‌ జెయింట్స్‌ జట్టు.. ఇండియా మహారాజాస్‌తో తలపడనుంది. 

కాగా, లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన 4 మ్యాచ్‌ల్లో రెండింటిలో ఆసియా లయన్స్‌, ఒక మ్యాచ్‌లో వరల్డ్‌ జెయింట్స్‌ విజయం సాధించగా.. ఇండియా మహారాజాస్‌ ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓ విజయం సాధించింది. లీగ్‌ తొలి మ్యాచ్‌లో ఆసియా లయన్స్‌ చేతిలో ఖంగుతిన్న (9 పరుగుల తేడాతో ఓటమి) మహారాజాస్‌.. రెండో మ్యాచ్‌లో వరల్డ్‌ జెయింట్స్‌ చేతిలో (2 పరుగుల తేడాతో ఓటమి) ఓటమిపాలయ్యారు. నిన్న ఆసియా లయన్స్‌పై గెలుపొందడంతో మహారాజాస్‌ టీమ్‌ బోణీ విజయం సాధించింది. 

మరిన్ని వార్తలు