Lewis Hamilton: వరుసగా ఐదో విజయం!

10 May, 2021 03:51 IST|Sakshi

వరుసగా ఐదోసారి స్పెయిన్‌ గ్రాండ్‌ప్రి టైటిల్‌ సొంతం

కెరీర్‌లో 98వ విజయం

బార్సిలోనా (స్పెయిన్‌): ఆరంభంలో ఆధిక్యం కోల్పోయినా... ఎక్కడా తడబడకుండా డ్రైవ్‌ చేస్తూ... చివరి దశలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మళ్లీ ఆధిక్యంలోకి వచ్చి... ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ స్పెయిన్‌ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ (ఎఫ్‌1) రేసును సొంతం చేసుకున్నాడు. 66 ల్యాప్‌లపాటు జరిగిన ఈ రేసులో ‘పోల్‌ పొజిషన్‌’తో మొదలుపెట్టిన హామిల్టన్‌ను తొలి మలుపు వద్ద రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఓవర్‌టేక్‌ చేసి ఆధిక్యంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వెర్‌స్టాపెన్‌ దూకుడు కొనసాగించగా... మళ్లీ ఆధిక్యంలోకి వచ్చేందుకు హామిల్టన్‌ పట్టువదలకుండా ప్రయత్నించాడు.

రేసు మరో ఆరు ల్యాప్‌ల్లో తర్వాత ముగుస్తుందనగా హామిల్టన్‌ వేగాన్ని పెంచి వెర్‌స్టాపెన్‌ను ఓవర్‌టేక్‌ చేసి ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత మిగతా ఆరు ల్యాప్‌ల్లో వెర్‌స్టాపెన్‌కు ఏమాత్రం అవకాశమివ్వకుండా హామిల్టన్‌ ట్రాక్‌పై రయ్‌రయ్‌మంటూ దూసుకుపోయి లక్ష్యాన్ని గంటా 33 నిమిషాల 07.680 సెకన్లలో అందుకొని విజేతగా నిలిచాడు.  స్పెయిన్‌ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌కిది వరుసగా ఐదో విజయంకాగా ఓవరాల్‌గా ఆరోది. హామిల్టన్‌కంటే ముందు దివంగత దిగ్గజ డ్రైవర్‌ అయిర్టన్‌ సెనా (బ్రెజిల్‌) మాత్రమే ఒకే గ్రాండ్‌ప్రిలో (మొనాకో గ్రాండ్‌ప్రి 1989 నుంచి 1993 వరకు) వరుసగా ఐదేళ్లు విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా హామిల్టన్‌ కెరీర్‌లో ఇది 98వ విజయం. తదుపరి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి ఈనెల 23న జరుగుతుంది.  

స్పెయిన్‌ గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్‌–10): 1. హామిల్టన్‌ (మెర్సిడెస్‌), 2. వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌), 3. బొటాస్‌ (మెర్సిడెస్‌), 4. లెక్‌లెర్క్‌ (ఫెరారీ), 5. పెరెజ్‌ (రెడ్‌బుల్‌), 6. రికియార్డో (మెక్‌లారెన్‌), 7. సెయింజ్‌ (ఫెరారీ), 8. నోరిస్‌ (మెక్‌లారెన్‌), 9. ఒకాన్‌ (అల్పైన్‌), 10. గాస్లీ (అల్ఫా టౌరి).

మరిన్ని వార్తలు