Ranji Trophy: ఆంధ్ర సెమీస్‌ చేరేనా! .. క్వార్టర్స్‌లో మధ్యప్రదేశ్‌తో ఢీ

31 Jan, 2023 08:28 IST|Sakshi

ఇండోర్‌: ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో బోనస్‌ పాయింట్‌తో గెలిచి... ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాలూ కలిసి రావడంతో... రంజీ ట్రోఫీలో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించిన ఆంధ్ర జట్టు... డిఫెండింగ్‌ చాంపియన్‌ మధ్యప్రదేశ్‌తో నేటి నుంచి జరిగే క్వార్టర్‌ ఫైనల్లో తలపడనుంది. గతంలో ఏనాడూ రంజీ ట్రోఫీలో సెమీఫైనల్‌కు అర్హత పొందలేకపోయిన ఆంధ్ర జట్టుకు కొత్త చరిత్ర లిఖించాలని పట్టుదలతో ఉంది.

అయితే పటిష్టంగా ఉన్న మధ్యప్రదేశ్‌పై ఆంధ్ర జట్టు గెలవాలంటే మాత్రం సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్‌లో ఆంధ్ర తరఫున బ్యాటింగ్‌లో రికీ భుయ్‌ (461), కెప్టెన్‌ హనుమ విహారి (448), అభిషేక్‌ రెడ్డి (384), కరణ్‌ షిండే (439) నిలకడగా రాణించారు. ఆల్‌రౌండర్లు నితీశ్‌ కుమార్‌ రెడ్డి (23 వికెట్లు, 146 పరుగులు), షోయబ్‌ ఖాన్‌ (21 వికెట్లు, 300 పరుగులు)లతోపాటు బౌలర్లు శశికాంత్‌ (26 వికెట్లు), లలిత్‌ మోహన్‌ (25 వికెట్లు), మాధవ్‌ రాయుడు (11 వికెట్లు) కూడా మెరిస్తే ఆంధ్ర సంచలన ఫలితం సాధించే అవకాశముంది.

బ్యాటింగ్‌లో రజత్‌ పాటిదార్, హిమాన్షు మంత్రి, శుభమ్‌ శర్మ... బౌలింగ్‌లో అవేశ్‌ ఖాన్, సారాంశ్‌ జైన్, కుమార్‌ కార్తికేయ, గౌరవ్‌ యాదవ్‌ నిలకడగా రాణిస్తూ మధ్యప్రదేశ్‌ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. మంగళవారమే మొదలయ్యే ఇతర క్వార్టర్‌ ఫైనల్స్‌లో జార్ఖండ్‌తో బెంగాల్‌; ఉత్తరాఖండ్‌తో కర్ణాటక; పంజాబ్‌తో సౌరాష్ట్ర తలపడతాయి.
చదవండిMarnus Labuschagne: కాఫీ బ్యాగులతో భారత్‌కు ఆసీస్‌ క్రికెటర్‌; తాగడానికా.. అమ్మడానికా?

మరిన్ని వార్తలు