గ్రూపులుగా శిక్షణ... జట్టుగా పతకం

8 Aug, 2021 05:06 IST|Sakshi

మన్‌ప్రీత్‌ సింగ్‌
గత 24 గంటలుగా పట్టరాని సంతోషంలో మునిగితేలుతున్నాం. ఆటగాళ్లంతా భావోద్వేగంతో ఉన్నారు. టోక్యోలో మేం (పురుషుల హాకీ) కాంస్యం గెలిస్తే... అమ్మాయిల జట్టేమో అద్భుతంగా పోరాడి నాలుగో స్థానంలో నిలిచింది. హాకీలో భారత జట్ల ప్రదర్శన యావత్‌ జాతిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచింది. ఇరు జట్లు ఇంతగా రాటుదేలడంలో ఎంతో ప్రణాళికబద్ధమైన కృషి దాగి ఉంది. శిక్షణ శిబిరాల్లో, మైదానాల్లో మేం కష్టపడితే... మా కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌), ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం, హాకీ ఇండియా (హెచ్‌ఐ) కష్టపడ్డాయి. అవసరమైన అన్నీ ఏర్పాట్లను సమయానుకూలంగా చేసి పెట్టాయి. గతేడాది మార్చి మొదట్లో కరోనా అలజడి మొదలైంది. కేంద్ర క్రీడా శాఖ లాక్‌డౌన్‌కు రెండు వారాల ముందే బెంగళూరు ‘సాయ్‌’ కేంద్రంలో మమ్మల్ని లాక్‌డౌన్‌కు సిద్ధం చేసింది. తొలుత ఈ కట్టడి కష్టమైనప్పటికీ తర్వాత్తర్వాత కేసుల పెరుగుదలతో అసలు సమస్య ఏంటో అర్థమైంది.

లాక్‌డౌన్‌ తర్వాత తెర మీదికొచ్చిన కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించడం అనివార్యమైంది. భౌతిక దూరంతో మా శిక్షణ కూడా మారింది. ఒకే శిబిరంలో ఉన్నా... కోవిడ్‌ రిస్క్‌ దృష్ట్యా గ్రూపులుగా, బ్యాచ్‌లుగా శిక్షణ ఇచ్చారు. ఇదే ఇప్పుడు జట్టుగా పతకం గెలిచేందుకు ఉపయోగపడింది. శిక్షణ ముగిసినా క్వారంటైన్, ఐసోలేషన్‌లతో ఇంటిముఖం చూసేందుకు నెలల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. 2019 డిసెంబర్‌లో జట్లను టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం పథకం (టాప్స్‌)లో చేర్చడం మాకెంతో మేలైంది. దీంతో ఎక్కడా మాకు నిధుల కొరతే ఎదురుకాలేదు. మహమ్మారి వల్ల మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కోల్పోయిన మాకు జూనియర్‌ జట్లతో ఏర్పాటు చేసిన పోటీలు కూడా ఉపయోగపడ్డాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాటలు మాకెంతో స్ఫూర్తినిచ్చాయి. టోక్యోకు వెళ్లేముందు, పతకం గెలిచాక ఆయన వ్యక్తిగతంగా ఫోన్‌ చేసి ఉత్తేజపరడం, స్ఫూర్తి రగిలించడం కన్నా గొప్ప రివార్డు, అవార్డులు ఏముంటాయి.  

మరిన్ని వార్తలు