NZ vs IRE: తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్‌ వికెట్లు.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా..!

21 Jul, 2022 11:11 IST|Sakshi

టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్‌ మైఖేల్ బ్రేస్‌వెల్ అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్‌లో వేసిన తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ వికెట్లు సాధించిన మొదటి ఆటగాడిగా బ్రేస్‌వెల్ రికార్డు సృష్టించాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టిన  బ్రేస్‌వెల్ ఈ ఘనత సాధించాడు. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ 14 ఓవర్‌ వేసిన బ్రేస్‌వెల్..  మూడు, నాలుగు, ఐదు బంతుల్లో వరుస వికెట్లు తీసి తొలి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

కాగా తన టీ20 కెరీర్‌లో ఇదే అతడికి తొలి ఓవర్‌. మూడో బంతికి మార్క్‌ అడైర్‌ బౌండరీ వద్ద క్యాచ్ రూపంలో వెనుదిరిగగా.. నాలుగో బంతికి మెక్‌ గ్రాతీ, ఐదో బంతికి క్రెగ్‌ యంగ్‌ పెవిలియన్‌కు చేరారు. ఈ మ్యాచ్‌లో కేవలం 5 బంతులే వేసిన అతడు ఐదు పరుగులతో పాటు మూడు వికెట్లు సాధించాడు. కాగా జూలై 18న ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బ్రేస్‌వెల్‌కు ఆ మ్యాచ్‌లో బౌలింగ్‌ చేసే అవకాశం రాలేదు. అదే విధంగా అంతర్జాతీయ టీ20ల్లో హ్యాట్రిక్‌ సాధించిన మూడో న్యూజిలాండ్‌ బౌలర్‌గా బ్రేస్‌వెల్‌ నిలిచాడు. అంతకుమందు జాకబ్‌ ఓరమ్‌,టిమ్‌ సౌథీ ఈ ఘనత సాధించారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఐర్లాండ్‌ను 88 పరుగుల తేడాతో కివీస్‌ చిత్తు చేసింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ 91 పరుగులకే కుప్ప కూలింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో  ఇష్ సోధి, మైఖేల్ బ్రేస్‌వెల్ చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. జాకబ్ డఫీ రెండు, లాకీ ఫెర్గూసన్ ఒక్క వికెట్‌ సాధించారు.

ఐర్లాండ్‌ బ్యాటర్లలో  మార్క్ అడైర్ 27 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి 179 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో వికెట్‌ కీపర్‌ క్లీవర్‌ 78 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. ఇక మూడు మ్యాచ్‌లో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే 2-0తో కివీస్‌ సొంతం చేసుకుంది.
చదవండి: IND vs ZIM: జింబాబ్వేతో వన్డే సిరీస్‌.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌..!

మరిన్ని వార్తలు