చెస్‌లో త్రుటిలో చేజారిన పతకం 

28 Sep, 2023 01:52 IST|Sakshi

ఆసియా క్రీడల చెస్‌ ఈవెంట్‌ వ్యక్తిగత విభాగాల్లో భారత్‌ ఒక్క పతకం కూడా గెలవలేకపోయింది. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో, కోనేరు హంపి 5.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. ఎనిమిదో రౌండ్‌లో హంపితో జరిగిన గేమ్‌ను హారిక 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో హారిక 30 ఎత్తుల్లో జినెర్‌ జు (చైనా)పై  గెలిచింది. ని ర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత జినెర్‌ జు ఏడు పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది.

ఉమిదా ఒమనోవా (ఉజ్బెకిస్తాన్‌), హు ఇఫాన్‌ (చైనా) 6.5 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు విదిత్‌ సంతోష్‌  గుజరాతి, ఇరిగేశి అర్జున్‌ 5.5 పాయింట్లతో వరుసగా ఐదు, ఆరు స్థానాలతో సరిపెట్టుకున్నారు. వె యి (చైనా; 7.5 పాయింట్లు) స్వర్ణం, నొదిర్‌బెక్‌ (ఉజ్బెకిస్తాన్‌; 7 పాయింట్లు)  రజతం, సిందరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌; 7 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు.   

మరిన్ని వార్తలు