Mohammed Siraj: 'క్రికెట్‌ వదిలేయ్‌.. మీ నాన్నతో వెళ్లి ఆటో తోలుకో'

8 Feb, 2022 12:03 IST|Sakshi

టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తన చీకటి రోజులను గుర్తు చేసుకున్నాడు. 2019 ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరపున చెత్త ప్రదర్శన నమోదు చేయడంతో తన కెరీర్‌ ముగిసిందనే అభిప్రాయానికి వచ్చానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే రెండు సంవత్సరాలు గడిచేసరికి ఇదే సిరాజ్‌ ప్రస్తుతం ఆర్‌సీబీకి ఫ్రంట్‌లైన్‌ బౌలర్‌గా ఉన్నాడు. ఆర్‌సీబీ రిటైన్‌ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లలో సిరాజ్‌ ఒకడు. మిగతావారిలో విరాట్‌ కోహ్లి, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌లు ఉ‍న్నారు. ఇక ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్‌ మెగావేలం జరగనుంది. ప్రస్తుతం సిరాజ్‌ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. షమీ, బుమ్రాల గైర్హాజరీలో సిరాజ్‌ ప్రస్తుతం బౌలింగ్‌లో పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్‌సీబీ పాడ్‌కాస్ట్‌కు సిరాజ్‌ ఇంటర్య్వూ ఇచ్చాడు.

చదవండి: Dinesh Karthik: "ఐపీఎల్‌లో ఆ జ‌ట్టుకు ఆడ‌డం నా క‌ల‌.. కానీ"


''2019 ఐపీఎల్‌ నాకు చీకటిరోజులు. ఆర్‌సీబీ తరపున ఆడుతున్న నేను కేకేఆర్‌తో మ్యాచ్‌లో దారుణ ప్రదర్శన కనబరిచాడు. కేవలం 2.2 ఓవర్లలోనే 33 పరుగులిచ్చి జట్టు ఓటమికి కారణమయ్యాడు. ఇక ఐపీఎల్‌ కెరీర్‌కు అవే నా చివరి రోజులు అని భావించా. దీనికి తోడు.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో వరుసగా రెండు బీమర్లు సంధించడంతో అభిమానుల ఆగ్రహానికి గురయ్యా. '' క్రికెట్‌ను వదిలేసేయ్‌.. వెనక్కి వెళ్లి నీ తండ్రితోపాటు ఆటోలు తోలుకో అంటూ'' అవమానకర కామెంట్లు చేశారు. ఇలాంటివి ఇంకా ఎన్నో భరించాను. అయితే ఆ సమయంలో ఆర్‌సీబీ నాకు అండగా నిలబడింది. వాస్తవానికి చెత్త ప్రదర్శన చేసిన ఒక బౌలర్‌పై వేటు వేయాల్సింది. కానీ ఆర్‌సీబీ యాజమాన్యం అలా చేయలేదు. నాకు అవకాశాలు ఇస్తూనే వచ్చారు. సరిగ్గా ఏడాది తర్వాత 2020 ఐపీఎల్‌లో మళ్లీ అదే కేకేఆర్‌పై అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించాను. నా కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

చదవండి: Virat Kohli: 2016 ఐపీఎల్‌ ఫైనల్లో ఓటమిపై విరాట్ కోహ్లి భావోద్వేగం..


ఇక టీమిండియాకు ఎంపికైన తొలిసారి ధోని భయ్యా ఒక మాట చెప్పాడు. ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా పట్టించుకోవద్దు. మంచి ప్రదర్శన చేసినప్పుడు వాళ్లే పొగుడుతారు.. చెత్త ప్రదర్శన చేస్తే తిడతారు.. ఇలాంటివి పట్టించుకోకుండా నీ ఆట నువ్వు ఆడు.. నిన్ను వెతుక్కుంటూ ప్రశంసలు అవే వస్తాయి. ధోని భయ్యా చెప్పింది అక్షరాలా నిజం. ఏ నోటితో అయితే నువ్వు క్రికెట్‌కు పనికిరావు అంటూ అవమానకరంగా మాట్లాడారో వాళ్లే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. ఇలాంటి ప్రశంసలకు ఉప్పొంగాల్సిన పని లేదు. నేను క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఎలా ఉన్నానో.. ఇప్పుడు అలానే ఉన్నాను. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది'' అంటూ చెప్పుకొచ్చాడు.  ఇక సిరాజ్‌ టీమిండియా తరపున 4 టెస్టులు, 2 వన్డేలు, 12 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో 50 మ్యాచ్‌ల్లో 50 వికెట్లు తీశాడు.

చదవండి: IPL 2022 Auction:షేక్‌ రషీద్‌ సహా ఏడుగురు అండర్‌-19 ఆటగాళ్లకు బిగ్‌షాక్‌!

మరిన్ని వార్తలు