దుబాయ్‌కి ఎగుమతి కానున్న ధోని ఆర్గానిక్‌ పంట

2 Jan, 2021 15:41 IST|Sakshi

రాంచీ: ఇటీవల కాలంలో సెలబ్రిటీలు వ్యవసాయం చేయడం పరిపాటిగా మారింది. లాక్‌డౌన్‌లో షూటింగ్‌లు వాయిదా పడటంతో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌, సైఫ్‌లు తమ ఫాంలో వ్యవసాయం చేస్తూ బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. అలాగే వీరి జాబితాలో చేరిన టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ పండించిన పంటను విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోని తన వ్యవసాయ పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ బిజీ అయిపోయిన విషయం తెలిసిందే. అంతేగాక ఆర్గానిక్ పద్దతిలో పండించిన తన‌ పంటను ధోని దుబాయ్‌కి ఎగుమతి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. మాజీ క్రికెటర్‌ అయిన ధోని ఆర్గానిక్‌ పద్ధతిలో వ్యవసాయం చేయడంతో అతడి పంటను కొనేందుకు దుబాయ్‌ రైతు మార్కెట్లు ఆసక్తిని కనబరుస్తున్నాయట.
(చదవండి: కొత్తజంటకు ధోని డిన్నర్‌ పార్టీ)

దీంతో ధోని సొంత వ్యవసాయ క్షేత్రంలో పండించిన ఆర్గానిక్‌ పంటకు భారీగా డిమాండ్ వస్తుండటంతో ఈ పంటను విదేశాలకు ఎగుమతి చేసేందుకు జార్ఖండ్‌ వ్యవసాయ శాఖ ముందుకొచ్చింది. రాంచీ శివార్లలోని సెంబో గ్రామం రింగ్ రోడ్డు వద్ద ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ధోని స్ట్రాబెర్రీలు, క్యాబేజీ, టమోటాలు, బ్రోకలీ, బఠానీలు, బొప్పాయిల పంటను ఆర్గానిక్‌ పద్దతిలో పండించాడు. దీంతో ఈ పంటను వ్యవసాయ శాఖ స్వయంగా దుబాయ్‌కి ఎగుమతి చేయనుంది. ఇప్పటికే రాంచీ మార్కెట్‌లో ధోని పండించిన కూరగాయలు, పళ్లకు భారీ డిమాండ్ ఉంది. ఆల్ సీజన్ ఫాం ఫెష్ ఏజెన్సీ ద్వారా వ్యవసాయ శాఖ గల్ఫ్ దేశాలకు కూరగాయలను పంపింది. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌ కింద ధోని పండించిన కూరగాయలను ‍కూడా ఎగుమతి చేయనుందని రాంచీ మార్కెటింగ్ కమిటీ అధిపతి అభిషేక్ ఆనంద్ తెలిపారు. ధోని జార్ఖండ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అని అతని పేరిట కూరగాయలను విదేశాలకు పంపించడం వల్ల జార్ఖండ్ రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు