ధోని కంటతడి పెట్టాడు!

20 Aug, 2020 17:07 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్న భారత మాజీ కెప్టెన్‌ ఎమ్మెస్‌ ధోనితో తన ప్రత్యేక అనుబంధాన్ని సహచరుడు, ఆఫ్‌ స్పిన్నర్‌ భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ గుర్తు చేసుకున్నాడు. తన యూట్యూబ్‌ చానల్‌ ‘రెమినిస్‌ విత్‌ యాష్‌’ ద్వారా మాట్లాడిన అశ్విన్‌... ధోని టెస్టులనుంచి తప్పుకున్న నాటి జ్ఞాపకాలను పంచుకున్నాడు. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోజు ధోని రాత్రంతా టీమిండియా జెర్సీ వేసుకునే ఉన్నాడని, బాధతో కంటతడి పెట్టుకున్నాడని తెలిపాడు. ‘2014లో ధోని టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించడం నాకు గుర్తుంది. నాడు మెల్‌బోర్న్‌ టెస్టులో జట్టును గెలిపించేందుకు నేను, ధోని చాలా కష్టపడ్డాం. కానీ ఓటమి పాలయ్యాం. అప్పుడే ధోని స్టంప్‌ తీసుకుంటూ ఇక నేను ముగించేస్తున్నా అని అన్నాడు.(చదవండి: నాకు సమాధానం తెలుసు.. కానీ: కుంబ్లే)

అదో భావోద్వేగ క్షణం. ఆనాటి సాయంత్రం ఇషాంత్, రైనా, నేను ధోని గదిలోనే కూర్చున్నాం. రాత్రంతా టెస్టు జెర్సీలోనే ఉన్న మహీ కంటతడి పెట్టుకున్నాడు’ అని అశ్విన్‌  గుర్తు చేసుకున్నాడు.  నెట్‌ బౌలర్‌గా తొలిసారి మాహిని కలుసుకున్నాన్న అశ్విన్, చెన్నై సూపర్‌ కింగ్స్‌లో చేరిన తర్వాత అతని నాయకత్వ లక్షణాలు అర్థమయ్యాయని చెప్పాడు. ‘2010 చాంపియన్స్‌ లీగ్‌ సందర్భంగా ధోని నాకో గొప్ప పాఠం నేర్పాడు. విక్టోరియా బుష్‌రేంజర్స్‌ మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌ వేశాను. అప్పుడు ధోని నా దగ్గరకు వచ్చి ఒత్తిడిలో నీ అత్యుత్తమ బంతిని వేయడం మరిచిపోయావు. క్యారమ్‌ బాల్‌ ఉపయోగించు అని చెప్పాడు. ఇప్పుడు కూడా నేను ఇదే మంత్రాన్ని వాడుతున్నా’ అని అశ్విన్‌ వివరించాడు.

అదే ధోని విజయ రహస్యం
మ్యాచ్‌ ఫలితంపై ఆందోళన చెందకుండా చివరివరకు నిజాయతీగా ప్రయత్నించడమే ధోని విజయాలకు కారణమని భారత దిగ్గజ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. కెప్టెన్‌గా ఎవరికీ సాధ్యం కానీ మూడు ఐసీసీ టైటిళ్లను ధోని తన ప్రశాంత చిత్తంతో గెలుచుకున్నాడని కితాబిచ్చాడు. భారత క్రికెట్‌కే కాకుండా ప్రపంచ క్రికెట్‌పై కూడా మిస్టర్‌ కూల్‌ ప్రభావితం చూపించాడని వ్యాఖ్యానించాడు. ‘టీమిండియాకు సారథ్యం వహించడం నా దృష్టిలో అతి కష్టమైన పని. ప్రపంచవ్యాప్తంగా అందరికీ భారత్‌పై అంచనాలు ఉంటాయి. ఈ భారాన్ని మోయలేం. కానీ ధోని ఎప్పుడూ ఫలితాన్ని ఆశించకుండా పనిచేశాడు. కోట్లాది భారతీయుల్ని ప్రభావితం చేశాడు. దేశానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎలా ఉండాలో, సమాజంలో మనం ఎలా ప్రవర్తించాలో చేసి చూపించాడు. అందుకే ధోనిని క్రీడాలోకమే కాకుండా సామాన్య ప్రజానీకం గౌరవిస్తుంది. తరచి చూస్తే ధోని రిటైర్మెంట్‌ ప్రకటించాక సామాజిక మాధ్యమాల్లో  సినీ తారలు, సామాజిక వేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయనాయకులు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రపంచ క్రికెట్‌కు అతను చేసిన సేవలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు కొనియాడుతున్నారు’ అని లక్ష్మణ్‌ వివరించాడు.

మమ్మల్ని షోలేలో ‘జై, వీరూ’ల్లా భావిస్తారు
ఎవరూ ఊహించని విధంగా ధోని వెంటే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు భారత స్టార్‌ ప్లేయర్‌ సురేశ్‌ రైనా. ఇప్పుడు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) కోసం సిద్ధమవుతోన్న అతను చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే) అభిమానులపై, కెప్టెన్‌ ధోనిపై తన ప్రేమను కురిపించాడు. 2003–04 నుంచే ధోని గురించి తనకు తెలుసని, బెంగళూరులో తరచుగా క్యాంపుల్లో కలిసేవారమని చెప్పాడు. కష్టకాలంలో ధోని తనకు అండగా నిలిచాడని పేర్కొన్నాడు. ఆటతో పాటు చుట్టూ ఉన్న వారి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల్లో ధోని ఒకడని ప్రశంసించాడు. ‘2007లో శస్త్రచికిత్సతో ఆటకు దూరమయ్యా. ఆ కష్టకాలంలో ధోని నన్ను నడిపించాడు. అప్పటినుంచే మానసికంగా దృఢంగా మారాను’ అని భారత్‌ తరఫున టెస్టు, వన్డే, టి20ల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచిన రైనా చెప్పాడు. చెన్నై అభిమానులు కురిపిస్తోన్న ప్రేమకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నాడు. ‘వారి స్వచ్ఛమైన ప్రేమ మాకు ఆశీర్వాదం. ధోనిని నన్ను వారు షోలే చిత్రంలోని జై, వీరూల్లా భావిస్తారు. ఆటతో పాటు మమ్మల్ని ప్రేమిస్తారు. ‘చిన్న తలా’ అని వారు పిలుస్తుంటే ఆనందంగా ఉంటుంది. అభిమానుల ప్రేమే  మమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది’ అని రైనా వ్యాఖ్యానించాడు.

మరిన్ని వార్తలు