IPL 2022: ధోని.. నా ఆలోచనలకు పూర్తి భిన్నంగా చేసేవాడు.. నేనేమీ కోహ్లిని కాదుగా: డు ప్లెసిస్‌

14 Mar, 2022 14:44 IST|Sakshi

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఫాప్‌ డుప్లెసిస్‌ ఎంపికైన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌-2022 మెగా వేలంలో డుప్లెసిస్‌ను రూ.7కోట్లకు కొనుగోలు చేసింది. అయితే గతంలో అతడు దాదాపు 10 సీజన్ల పాటు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ క్రమంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తన అనుబంధాన్ని డుప్లెసిస్‌ గుర్తు చేసుకున్నాడు. "నేను చాలా అదృష్టవంతుడిని. నా క్రికెట్‌ జర్నీలో ఇప్పటివరకు కొంత మంది అధ్బతమైన సారథిలతో కలిసి పని చేశాను.

ముఖ్యంగా దక్షిణాఫ్రికా అత్యుత్తమ నాయకుడైన గ్రేమ్ స్మిత్‌ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అదే విధంగా ఐపీఎల్‌లో 10 ఏళ్ల పాటు మిస్టర్‌ కూల్‌ మహేంద్రసింగ్‌ ధోని, స్టీఫెన్ ఫ్లెమింగ్ వంటి అద్భుతమైన కెప్టెన్‌లతో కలిసి ఆడాను. నా నాయకత్వ శైలి ధోనీని పోలి ఉంటుంది. మేమిద్దరం ఫీల్డ్‌లో చాలా రిలాక్స్‌గా ఉంటాం. నేను ఆరంభంలో చెన్నైకు ప్రాతినిథ్యం వహించినప్పుడు ధోని ఆలోచనలు నాకు ఆర్ధం కాలేదు. నేను అనుకున్న దానికంటే అతడు భిన్నంగా ఉండేవాడు.

ఇక ఐపీఎల్‌ వంటి మెగా టోర్నీలో నాయకత్వం వహించడం వల్ల వచ్చే ఒత్తిడి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రతి ఒక్కరకి జట్టును నడిపించడంలో తన దైన శైలి ఉంటుంది. నేను నా స్టైల్‌లోనే జట్టును నడిపిస్తాను. మనపై  ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మన స్వంత నిర్ణయాలతో ముందుకు పోవడం మంచింది. నేను కోహ్లిలా ఉండటానికి ప్రయత్నించను. ఎందుకంటే నేను కోహ్లిని కాను. అదే విధంగా ధోనిను కూడా ఫాలో అవ్వను. కానీ ధోని నుంచి నేను నేర్చుకున్న చాలా విషయాలు నా నాయకత్వ శైలిని పెంచుకోవడంలో సహాయపడతాయి" అని డుప్లెసిస్‌ పేర్కొన్నాడు. ఇక మార్చి 27న ఆర్సీబీ తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది.

చదవండి: Virat Kohli: ‘కోహ్లిని మళ్లీ టెస్టు కెప్టెన్‌గా నియమించండి’!

మరిన్ని వార్తలు