సిరాజ్‌, ప్రసిద్ద్‌ కాదు.. అతడే జూనియర్‌ మహ్మద్‌ షమీ: అశ్విన్‌

26 Nov, 2023 10:38 IST|Sakshi
(PC:twitter/BCCI)

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా యువ పేసర్‌ ముఖేష్‌ కుమార్‌ తన బౌలింగ్‌ స్కిల్‌తో అందరని అకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముఖేష్‌ వికెట్లు పడగొట్టకపోయినప్పటికీ.. తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్‌ వేసిన ముఖేష్‌ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి ఆసీస్‌ జోరుకు కళ్లెం వేశాడు. చివర్‌ ఓవర్‌లో అతడు బౌన్సర్లు, యార్కర్లు వేసి ఆసీస్‌ బ్యాటర్లను సైలెంట్‌గా వుంచాడు. 

ఓవరాల్‌గా తన 4 ఓవర్ల కోటాలో ముఖేష్‌ 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక తిరునవంతపురం వేదికగా జరగనున్న రెండో టీ20లో కూడా సత్తాచాటాలని ముఖేష్‌ కుమార్‌ భావిస్తున్నాడు. ఈ క్రమంలో ముఖేష్‌ కుమార్‌పై టీమిండియా వెటరన్‌  స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖేష్‌కు మహ షమీ లాంటి బౌలింగ్‌ స్కిల్స్‌ ఉన్నాయని అశ్విన్‌ కొనియాడాడు.

"నేను మొదట్లో మహ్మద్‌ సిరాజ్‌ జూనియర్ షమీ అవుతాడని అనుకున్నాను. కానీ ఇప్పుడు యువ పేసర్‌ ముఖేష్ కుమార్‌ను చూస్తే జూనియర్ షమీ అవుతాడని అన్పిస్తుంది. షమీ అని అందరూ ముద్దుగా 'లాలా' అని పిలుస్తారు. నేను మాత్రం షమీని లాలెట్టన్ అని పిలుస్తాను. ఎందుకంటే నాకెంతో ఇష్టమైన నటుడి మోహన్ లాల్ ముద్దుపేరు లాలెట్టన్. ముఖేష్‌.. షమీ బౌలింగ్‌ యాక్షన్‌ను పోలి ఉన్నాడు.

అతడితో పాటు సమానమైన ఎత్తును కూడా కలిగి ఉన్నాడు. అతడితో అద్భుతంగా యార్కర్లు బౌలింగ్‌ చేయగలడు. బంతిపై మంచి కంట్రోల్‌, అద్భుతమైన బ్యాక్-స్పిన్ కలిగి ఉన్నాడు. వెస్టిండీస్‌లో జరిగిన సిరీస్‌లో అతడు బాగా బౌలింగ్ చేశాడు. బార్బడోస్‌లో జరిగిన ప్రాక్టీస్ గేమ్‌లో అత్యుత్తమంగా రాణించాడని" తన యూట్యూబ్‌ ఛానల్‌లో అశ్విన్‌ పేర్కొన్నాడు.
చదవండిమంచి మనసు.. ఓ వ్యక్తి ప్రాణం కాపాడిన మహ్మద్‌ షమీ! వీడియో వైరల్

మరిన్ని వార్తలు