నూతన భారతావనికి నీవొక స్ఫూర్తి

21 Aug, 2020 03:20 IST|Sakshi

విజయవంతమైన కెరీర్‌ను ప్రశంసిస్తూ మోదీ లేఖ 

అభిమానులతో పంచుకున్న మాజీ కెప్టెన్‌ 

న్యూఢిల్లీ: ధోని అంటేనే ధనాధన్‌. దీనికి న్యాయం చేస్తూ... తొలి పొట్టి ప్రపంచకప్‌ (2007)ను భారత్‌కు అందించాడు. ధోని అంటేనే నడిపించే నాయకుడు... దీన్ని వన్డే ప్రపంచకప్‌ (2011) ఫైనల్లో చూపించాడు. మరెన్నో క్లిష్టమైన మ్యాచ్‌ల్ని తనకిష్టమైన షాట్లతో ముగించాడు. ఆటలో, ఆర్మీలో తన మనోనిబ్బరాన్ని గట్టిగా చాటిన ధోని వీడ్కోలుపై సాక్షాత్తూ దేశ ప్రధానే స్పందించారు. అతని 15 ఏళ్ల కెరీర్‌లో భారతావని మురిసిన క్షణాల్ని ఉదహరిస్తూ యువతకు స్ఫూర్తి ప్రధాతగా నిలిచావంటూ కితాబిస్తూ లేఖ రాశారు. క్రికెట్‌ కెరీర్‌ కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిన ధోనికి ఇకపై కుటుంబ జీవితం సాఫీగా సాగాలని మనసారా దీవించారు. లేఖ పూర్తి పాఠం

ప్రధాని మాటల్లోనే.... 
‘ఎక్కడి నుంచి వచ్చామన్నది ముఖ్యం కాదు... ఏం సాధించాం, ఎలా సఫలీకృతం అయ్యామన్నదే ముఖ్యం. ఈ నీ ప్రేరణే యువతకు మార్గనిర్దేశం. ఓ చిన్న పట్టణం నుంచి వచ్చిన నీవు యావత్‌ దేశమే గర్వించేస్థాయికి ఎదిగావు. జాతిని గర్వపడేలా చేశావు. భారత్‌లో, క్రికెట్‌లో నీకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చావ్‌. నీ ఆటతీరుతో కోట్లాది అభిమానుల్ని అలరించావు. నీ పట్టుదలతో  యువతరానికి స్ఫూర్తిగా నిలిచావు. నూతన భారతావనికి నీవొక రోల్‌ మోడల్‌. ఇంటిపేరు లేకుండా వచ్చిన నీవు గొప్ప పేరు, ప్రఖ్యాతలతో నిష్క్రమిస్తున్నావు. నా దృష్టిలో  టీమిండియాకు అత్యుత్తమ సారథివి నీవే! నీ సమర్థ నాయకత్వంతో జట్టును అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లావు. బ్యాట్స్‌మన్‌గా, వికెట్‌ కీపర్‌గా బహుముఖ ప్రజ్ఞాపాటవాలున్న అరుదైన క్రికెటర్‌గా నీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది.

జట్టు క్లిష్ట పరిస్థితుల్లో.... నీవున్నావనే భరోసా టీమిండియాను ఒడ్డున పడేస్తావన్న ధీమా ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదు. ముఖ్యంగా 2011 వన్డే ప్రపంచకప్‌ తెచ్చిపెట్టిన ఘనత తరాల పాటు ప్రజల మదిలో చెక్కు చెదరదు. ఇక నీ పేరు క్రికెట్‌ లెక్కా పద్దులకు, రికార్డులకే పరిమితం చేయడం ఏమాత్రం సరైంది కాదు. చరిత్రలో నిలిచిన ‘మహేంద్రసింగ్‌ ధోని’ని అంచనా వేసేందుదుకు ఏ కితాబులు సరితూగవు.  తోటివారిని ప్రోత్సహిస్తూ ధైర్యంగా ముందడుగు వేస్తూ యంగ్‌ టీమిండియా సాధించిన 2007 టి20 ప్రపంచకప్‌ నీ సారథ్యానికి సాటిలేని ఉదాహరణ

 నీ హెయిర్‌ స్టయిల్‌ ఎప్పుడెలా ఉన్నా...  గెలుపోటములను మాత్రం సమానంగా స్వీకరించే లక్షణం చాలా మంది నేర్చుకోవాల్సిన పాఠం. క్రికెట్‌ బాధ్యతలతో పాటు ఆర్మీకి చేసిన సేవలు అమూల్యం. ఇంతటి ఘనమైన... సాఫల్యమైన కెరీర్‌కు కుటుంబసభ్యుల (సతీమణి సాక్షి, కుమార్తె జీవా) మద్దతు ఎంతో అవసరం. ఇకపై నీవు జట్టు సభ్యులతో కాకుండా మీ వాళ్లతో కావాల్సినంత సమయం గడపొచ్చు. నీకంతా మంచే జరగాలి’’ అని మోదీ లేఖలో శుభాశీస్సులు తెలిపారు. ఈ లేఖను ట్వీట్‌ చేసిన ధోని ప్రధానికి కృతజ్ఞతలు తెలిపాడు. ‘కళాకారులు, సైనికులు, క్రీడాకారులు అభినందనల్నే ఆశిస్తారు. వాళ్ల కృషి, త్యాగాలను ప్రతీ ఒక్కరు గుర్తించాలనే భావిస్తారు’ అని ధోని తెలిపారు.  

మరిన్ని వార్తలు