BGT 2023 IND VS AUS 2nd Test: పుజారాపై పగపట్టిన నాథన్‌ లియోన్‌

18 Feb, 2023 13:12 IST|Sakshi

Nathan Lyon-Pujara: కెరీర్‌లో 100వ టెస్ట్‌ ఆడుతున్న టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, నయా వాల్‌ చతేశ్వర్‌ పుజారాపై ఆసీస్‌ స్టార్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ పగపట్టాడు. న్యూఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పుజారాను డకౌట్‌ చేసి పెవిలియన్‌కు పంపిన లియోన్‌ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ కోల్పోయిన తొలి నాలుగు వికెట్లను తన ఖాతాలోనే వేసుకున్న లియోన్‌.. తన కెరీర్‌లో ఓ బ్యాటర్‌ను అత్యధిక సార్లు ఔట్‌ చేసిన రికార్డును సవరించుకున్నాడు.

లియోన్‌ తన టెస్ట్‌ కెరీర్‌లో పుజారాను అత్యధికంగా 11 సార్లు ఔట్‌ చేయడం ద్వారా తన బాధిత బ్యాటర్ల జాబితాలో పుజారాకు తొలిస్థానం కల్పించాడు. వందో టెస్ట్‌ ఆడుతున్నాడన్న కనికరం కూడా లేని లియోన్‌.. పుజారాను బాగా ఇబ్బంది పెట్టి వికెట్ల ముందు (ఎల్బీడబ్ల్యూ) దొరికించుకున్నాడు. లియోన్‌ బాధిత బ్యాటర్ల జాబితాలో పుజారా తర్వాత అజింక్య రహానే రెండో స్థానంలో ఉన్నాడు. లియోన్‌ రహానేను 10 సార్లు ఔట్‌ చేశాడు. ఆ తర్వాత సువర్ట్‌ బ్రాడ్‌ (9), బెన్‌ స్టోక్స్‌ (9), మొయిన్‌ అలీ (9), అలిస్టర్‌ కుక్‌ (8), టిమ్‌ సౌథీ (8) లను లియోన్‌ టెస్ట్‌ల్లో అత్యధిక సార్లు ఔట్‌ చేశాడు. 

ఇదిలా ఉంటే, బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌ నువ్వా-నేనా అన్నట్లుగా సాగుతుంది. తొలి రోజు భారత బౌలర్ల విజృంభణతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్‌ కాగా.. రెండో రోజు ఆట ప్రారంభం కాగానే ఆసీస్‌ స్పిన్నర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా లియోన్‌ బంతిని గింగిరాలు తిప్పుతూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

రెండో రోజు ఆట మొదలైన కాసేపటికే  కేఎల్‌ రాహుల్‌ (17)ను పెవిలియన్‌కు పంపిన లియోన్.. ఆ తర్వాత రోహిత్‌ శర్మ (32), పుజారా (0), శ్రేయస్‌ అయ్యర్‌ (4)లను వరుసగా ఔట్‌ చేశాడు. ఆతర్వాత కోహ్లి (36), జడేజా (26) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తుండగా.. ఈ సారి టాడ్‌ మర్ఫీ విజృంభించాడు. జడ్డూను మర్ఫీ వికెట్ల ముందు దొరికించుకున్నాడు.

జడేజా ఔటయ్యే సమయానికి టీమిండియా స్కోర్‌ 125/5గా ఉంది. భారత్‌.. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 138 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఖ్వాజా (81), హ్యాండ్స్‌కోంబ్‌ (72) అర్ధసెంచరీలతో రాణించగా.. టీమిండియా బౌలర్లు షమీ 4, అశ్విన్‌, జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టారు.  4 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి టెస్ట్‌ మ్యాచ్‌ గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు