సిరీస్‌తోపాటు ‘టాప్‌’ ర్యాంక్‌ సొంతం

14 Jun, 2021 03:14 IST|Sakshi

రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్‌ ఘనవిజయం

బర్మింగ్‌హమ్‌: ఇంగ్లండ్‌తో జరిగిన చివరిదైన రెండో టెస్టులో న్యూజిలాండ్‌ ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్‌ను 1–0తో కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 38 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 10.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసి గెలిచింది. 1999లో స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ నాయకత్వంలోని న్యూజి లాండ్‌ బృందం ఇంగ్లండ్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌కు దక్కిన తొలి టెస్టు సిరీస్‌ విజయం ఇదే కావడం విశేషం. మరోవైపు 2014 తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్‌ను కోల్పోవడం ఇంగ్లండ్‌కు ఇదే మొదటిసారి. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 122/9తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్‌... రోజు తొలి బంతికే మిగిలిన వికెట్‌ను కోల్పోయి ఆలౌటైంది. హెన్రీ, వ్యాగ్నర్‌ చెరో మూడు వికెట్లు తీశారు.

అగ్ర స్థానంలోకి: ఇంగ్లండ్‌పై సిరీస్‌ విజయంతో న్యూజిలాండ్‌ జట్టు ఐసీసీ టెస్టు టీమ్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అందుకుంది. ఈ సిరీస్‌కు ముందు భారత్‌ 121 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో, న్యూజిలాండ్‌ 120 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచాయి. అయితే తాజా విజయంతో న్యూజిలాండ్‌ 123 పాయింట్లతో అగ్రస్థానంలోకి వెళ్లగా... భారత్‌ రెండో స్థానానికి పడిపోయింది.

మరిన్ని వార్తలు