Novak Djokovic: గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లే కాదు జరిమానా పొందడంలోనూ రికార్డే

18 Jul, 2023 13:42 IST|Sakshi

24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాలన్న నొవాక్‌ జొకోవిచ్‌ కలను చెరిపేశాడు స్పెయిన్‌ యువ సంచలనం కార్లోస్‌ అల్‌కరాజ్‌. ఆదివారం ఇద్దరి మధ్య జరిగిన వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ హోరాహోరీగా సాగింది. కొదమ సింహాల్లా తలపడిన ఇద్దరిలో ఎవరు తేలిగ్గా ఓడిపోయేందుకు ఒప్పుకోలేదు. అయితే తొలి సెట్‌ ఓడినప్పటికి రెండు, మూడు సెట్‌లు గెలిచి ఆధిక్యంలోకి వచ్చిన అల్‌కరాజ్‌ ఇక ఈజీగా చాంపియన్‌ అవుతాడని అంతా ఊహించారు.

కానీ జొకోవిచ్‌ నాలుగో సెట్‌లో ప్రతిఘటించడంతో పాటు సెట్‌ను గెలుచుకొని రేసులోకి వచ్చాడు. అయితే కుర్రాడి కదలికల ముందు జొకోవిచ్‌ అనుభవం పనికిరాలేదు. ఐదో సెట్‌లో పోరాడినప్పటికి అల్‌కరాజ్‌ దూకుడు ముందు ఓడిపోవాల్సి వచ్చింది.  తాజాగా వింబుల్డన్‌ ఫైనల్‌ సందర్భంగా టెన్నిస్‌ రాకెట్‌ను విరగొట్టినందుకు గానూ జొకోవిచ్‌కు భారీ జరిమానా పడింది.

ఐదో సెట్‌లో భాగంగా అల్‌కరాజ్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన జొకోవిచ్‌.. కాసేపటికే తన సర్వీస్‌ను కోల్పోయాడు. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకొని కోపంతో రాకెట్‌ను నెట్‌పోస్ట్‌కు బలంగా విసిరికొట్టాడు. దీంతో రాకెట్‌ రెండు ముక్కలయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదంతా గమనించిన అంపైర్‌ ఫెర్గూస్‌ ముర్ఫీ జొకోవిచ్‌కు ఫీల్డ్‌లోనే వార్నింగ్‌ ఇచ్చాడు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం సెర్బియా స్టార్‌కు 8వేల అమెరికన్‌ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 6లక్షల 50వేలు) జరిమానా విధించారు. కాగా టెన్నిస్‌లో 2023 ఏడాదిలో జొకోవిచ్‌కు విధించిన జరిమానా ఇప్పటివరకు అత్యధికమని చెప్పొచ్చు.

చదవండి:  'భోజన ప్రియుడ్ని చూశాం.. వాహన ప్రియుడ్ని చూడడం ఇదే తొలిసారి'

రెక్కలు కట్టుకు తిరుగుతున్న రషీద్‌ ఖాన్‌.. ఎక్కడ చూసినా అతడే..!

మరిన్ని వార్తలు