ODI World Cup 2023: 'అష్ట' దిగ్భంధనం

15 Oct, 2023 05:00 IST|Sakshi

ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌కు ఎనిమిదో విజయం

మరోసారి అదరగొట్టిన టీమిండియా

7 వికెట్ల తేడాతో పాక్‌ చిత్తు

చెలరేగిన రోహిత్, బౌలర్లు

గురువారం బంగ్లాదేశ్‌తో భారత్‌ మ్యాచ్‌

వన్డే వరల్డ్‌ కప్‌లో లెక్క మారలేదు. 31 ఏళ్లుగా పాకిస్తాన్‌పై వేర్వేరు వేదికల్లో కనిపించిన ఆధిపత్యం అహ్మదాబాద్‌లోనూ కొనసాగింది. ఫేవరెట్‌గా భావించిన భారత జట్టు అన్ని రంగాల్లో చెలరేగి పాక్‌ను ఊపిరాడనీయకుండా చేసింది. ఒకవైపు భారత బౌలర్లంతా సమష్టిగా చెలరేగుతుంటే... మరోవైపు లక్ష మంది జనం ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ హోరెత్తిస్తుంటే... మైదానంలో దాయాది జట్టు బెంబేలెత్తిపోయింది... బ్యాటింగ్‌లో కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేక... కనీసం 200 పరుగులు కూడా చేయలేక కుప్పకూలింది... ఆపై మొదటి బంతి నుంచే ఇండియా జోరు మొదలైంది... సిక్సర్లతో చెలరేగిపోతున్న రోహిత్‌ శర్మను నిలువరించలేక పాక్‌ బౌలర్లు చేతులెత్తేయగా మరో అలవోక విజయం మన ఖాతాలో చేరింది. ఏకంగా 19.3 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించిన టీమిండియా వరల్డ్‌ కప్‌లో చిరకాల ప్రత్యరి్థపై తన అజేయ రికార్డును ఘనంగా నిలబెట్టుకుంది. 8–0తో సంపూర్ణ ఆధిక్యాన్ని ప్రదర్శించింది.   

అహ్మదాబాద్‌: ప్రపంచకప్‌లో తిరుగులేకుండా దూసుకుపోతున్న భారత జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసింది. పటిష్టమైన టీమిండియా అంచనాలకు అనుగుణంగా చెలరేగి పాకిస్తాన్‌పై ఏకపక్ష విజయాన్ని అందుకుంది. శనివారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఎలాంటి హోరాహోరీ, పోటాపోటీ లేకుండా సాగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది.

కెప్టెన్న్‌ బాబర్‌ ఆజమ్‌ (58 బంతుల్లో 50; 7 ఫోర్లు), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (69 బంతుల్లో 49; 7 ఫోర్లు) మినహా ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఒకదశలో 155/2తో మెరుగైన స్థితిలో కనిపించిన పాక్‌ 36 పరుగుల తేడాలో 8 వికెట్లు కోల్పోయింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జస్‌ప్రీత్‌ బుమ్రా (2/19) రెండు కీలక వికెట్లు తీయగా... పాండ్యా, కుల్దీప్, జడేజా, సిరాజ్‌ కూడా తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్‌ 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్న్‌ రోహిత్‌ శర్మ (63 బంతుల్లో 86; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్‌తో భారత్‌ గెలుపును సులువుగా మార్చగా... శ్రేయస్‌ అయ్యర్‌ (62 బంతుల్లో 53 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌ను గురువారం పుణేలో బంగ్లాదేశ్‌తో ఆడుతుంది.  

ఆ భాగస్వామ్యం మినహా...
పాకిస్తాన్‌ తమ ఇన్నింగ్స్‌ను సానుకూలంగానే ప్రారంభించింది. ఓపెనర్లు ఇమామ్‌ ఉల్‌ హక్‌ (38 బంతుల్లో 36; 6 ఫోర్లు), అబ్దుల్లా షఫీక్‌ (20) ఒత్తిడికి లోనుకాకుండా చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. అయితే షఫీక్‌ను సిరాజ్‌ ఎల్బీగా అవుట్‌ చేయడంతో పాక్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే ఇమామ్‌ను పాండ్యా వెనక్కి పంపించాడు. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యత సీనియర్లు బాబర్, రిజ్వాన్‌లపై పడింది. జడేజా తన తొలి ఓవర్లోనే రిజ్వాన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నా... బ్యాటర్‌ రివ్యూలో అది నాటౌట్‌గా తేలింది. ఇద్దరు బ్యాటర్లు జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిరి్మంచే ప్రయత్నం చేశారు.

భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 57 బంతుల్లో బాబర్‌ అర్ధసెంచరీ పూర్తయింది. అయితే సిరాజ్‌ వేసిన చక్కటి బంతి స్టంప్స్‌ పైభాగాన్ని తాకడంతో బాబర్‌ అదే స్కోరు వద్ద నిరాశగా ని్రష్కమించాడు. అంతే... ఆ వికెట్‌ తర్వాత పాక్‌ పతనం వేగంగా సాగింది. కుల్దీప్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి దెబ్బ కొట్టగా, బుమ్రా ఆఫ్‌కటర్‌కు రిజ్వాన్‌ బౌల్డ్‌ కావడంతో భారీ స్కోరుపై పాక్‌ ఆశలు వదులుకుంది. మిగిలిన నాలుగు వికెట్ల లాంఛనాన్ని పూర్తి చేయడానికి భారత్‌కు ఎంతో సమయం పట్టలేదు. పాకిస్తాన్‌పై 2011 వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్‌ (మొహాలిలో) తరహాలోనే భారత్‌ తరఫున ఐదుగురు బౌలర్లు తలా 2 వికెట్లు పంచుకోవడం విశేషం.  

మెరుపు బ్యాటింగ్‌...
డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌లెగ్, వైడ్‌ లాంగాన్, మిడాన్, కవర్స్, స్క్వేర్‌ లెగ్, డీప్‌ మిడ్‌ వికెట్‌... రోహిత్‌ శర్మ అలవోకగా వేర్వేరు దిశల్లో బాదిన ఆరు సిక్సర్లు ఇవి! స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ ఛేదించేందుకు సిద్ధమైన తరుణంలో స్టేడియంలోని అభిమానులకు ఇదే తరహా రోహిత్‌ ఆట వినోదం పంచింది. ఇన్నింగ్స్‌ తొలి బంతిని ఫోర్‌తో మొదలు పెట్టిన రోహిత్‌ ఎప్పుడెప్పుడు మ్యాచ్‌ను ముగిద్దామా అన్నట్లుగా వేగంగా దూసుకుపోయాడు. మరో ఎండ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ (11 బంతుల్లో 16; 4 ఫోర్లు), కోహ్లి (18 బంతుల్లో 16; 3 ఫోర్లు) మాత్రం విఫలమయ్యారు. షాదాబ్‌ చక్కటి క్యాచ్‌కు గిల్‌ వెనుదిరగ్గా, పేలవ షాట్‌ ఆడి కోహ్లి ని్రష్కమించాడు. అయితే రోహిత్‌ జోరును మాత్రం పాక్‌ అడ్డుకోలేకపోయింది.

36 బంతుల్లోనే అతను 3 ఫోర్లు, 4 సిక్సర్లతో రోహిత్‌ అర్ధసెంచరీ పూర్తయింది. ఆ తర్వాతా పాక్‌ బౌలర్లను వదలకుండా మరో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదిన రోహిత్‌ జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లాడు. కానీ విజయానికి మరో 36 పరుగులు చేయాల్సిన స్థితిలో అవుటై రోహిత్‌ వరల్డ్‌ కప్‌ చరిత్రలో ఎనిమిదో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అనంతరం అయ్యర్, కేఎల్‌ రాహుల్‌ (29 బంతుల్లో 19 నాటౌట్‌; 2 ఫోర్లు) కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్‌ను ముగించారు. నవాజ్‌ వేసిన 31వ ఓవర్‌ మూడో బంతిని నేరుగా శ్రేయస్‌ బౌండరీకి తరలించగా అతని అర్ధసెంచరీతో పాటు భారత్‌ విజయం పూర్తయింది.
       
మా బౌలర్లే ఈ రోజు మ్యాచ్‌ ఫలితాన్ని శాసించారు. పాక్‌ కనీసం 290 వరకు వెళుతుందనుకుంటే 191 పరుగులకే కట్టడి చేయడం అద్భుతం. బౌలర్లంతా సమష్టిగా సత్తా చాటారు. అందరూ అన్ని రోజుల్లో బాగా ఆడలేరు. మనదైన రోజును మరో అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోవాలి. నేను అదే పని చేశాను. కెప్టెన్న్‌గా కూడా నాపై అదనపు బాధ్యత ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా పాక్‌ను మేం మరో ప్రత్యర్థిగానే చూశాం తప్ప ఎలాంటి ప్రత్యేకత లేదు. మేం గత రికార్డును పట్టించుకోలేదు. ప్రపంచకప్‌లోకి అడుగు పెట్టక ముందే జట్టులో అందరికీ తమ బాధ్యతలపై స్పష్టత ఉంది. అందుకే అందరూ తమదైన పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ విజయంతో మేమేమీ అతిగా ఉప్పొంగిపోవడం లేదు. టోరీ్నలో ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి.

–రోహిత్‌ శర్మ, భారత కెప్టెన్న్‌

స్కోరు వివరాలు  
పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: షఫీక్‌ (ఎల్బీ) (బి) సిరాజ్‌ 20; ఇమామ్‌ (సి) రాహుల్‌ (బి) పాండ్యా 36; బాబర్‌ ఆజమ్‌ (బి) సిరాజ్‌ 50; రిజ్వాన్‌ (బి) బుమ్రా 49; షకీల్‌ (ఎల్బీ) (బి) కుల్దీప్‌ 6; ఇఫ్తికార్‌ (బి) కుల్దీప్‌ 4; షాదాబ్‌ (బి) బుమ్రా 2; నవాజ్‌ (సి) బుమ్రా (బి) పాండ్యా 4; హసన్‌ (సి) గిల్‌ (బి) జడేజా 12; షాహిన్‌ అఫ్రిది (నాటౌట్‌) 2; రవూఫ్‌ (ఎల్బీ) (బి) జడేజా 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (42.5 ఓవర్లలో ఆలౌట్‌) 191.
వికెట్ల పతనం: 1–41, 2–73, 3–155, 4–162, 5–166, 6–168, 7–171, 8–187, 9–187, 10–191.
బౌలింగ్‌: బుమ్రా 7–1–19–2, సిరాజ్‌ 8–0–50–2, పాండ్యా 6–0–34–2, కుల్దీప్‌ 10–0–35–2, జడేజా 9.5–0–38–2, శార్దుల్‌ 2–0–12–0.  

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) ఇఫ్తికార్‌ (బి) షాహిన్‌ 86; గిల్‌ (సి) షాదాబ్‌ (బి) షాహిన్‌ 16; కోహ్లి (సి) నవాజ్‌ (బి) హసన్‌ అలీ 16; అయ్యర్‌ (నాటౌట్‌) 53; కేఎల్‌ రాహుల్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (30.3 ఓవర్లలో 3 వికెట్లకు) 192.
వికెట్ల పతనం: 1–23, 2–79, 3–156.
బౌలింగ్‌: షాహిన్‌ అఫ్రిది 6–0–36–2, హసన్‌ అలీ 6–0–34–1, నవాజ్‌ 8.3–0–47–0, రవూఫ్‌ 6–0–43–0, షాదాబ్‌ 4–0–31–0.

మరిన్ని వార్తలు