ICC World Cup Super League: రోజుల వ్యవధిలోనే అంతా తలకిందులు.. అక్కడ క్లీన్‌స్వీప్‌ చేసి.. ఇక్కడ వైట్‌వాష్‌కు గురై!

13 Jun, 2022 10:33 IST|Sakshi
వెస్టిండీస్‌పై పాకిస్తాన్‌ ఘన విజయం(PC: PCB Twitter)

మూడో వన్డేలోనూ గెలుపొంది వెస్టిండీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన పాకిస్తాన్‌

Pakistan vs West Indies ODI Series: వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలోనూ పాకిస్తాన్‌ పైచేయి సాధించింది. వరుణుడి ఆటంకం కారణంగా 48 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో 53 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా స్వదేశంలో విండీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసి సత్తా చాటింది. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం నికోలస్‌ పూరన్‌ బృందం పాకిస్తాన్‌ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ముల్తాన్‌ వేదికగా జరిగిన మొదటి రెండు మ్యాచ్‌లలో పరాజయం పాలైన వెస్టిండీస్‌.. మూడో వన్డేలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావించింది. కానీ, పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ 86 పరుగులతో పాక్‌ జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించి.. పర్యాటక జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. ఓపెనర్లు ఫఖార్‌ జమాన్‌(35),ఇమామ్‌ ఉల్‌-హక్‌(62)కు తోడు షాబాద్‌ బ్యాట్‌ ఝులిపించడంతో 48 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఆతిథ్య పాక్‌ 269 పరుగులు చేసింది.

ఇక లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు టాపార్డర్‌ కుప్పకూలడంతో కష్టాలు తప్పలేదు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అకీల్‌ హుసేన్‌ ఒక్కడే 60 పరుగులతో మెరుగ్గా రాణించాడు. మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో 37.2 ఓవర్లలోనే విండీస్‌ ఆలౌట్‌ అయి, పాక్‌ చేతిలో 53 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. 

మూడో వన్డేలో ఓటమితో 0-3 తేడాతో వైట్‌వాష్‌కు గురైంది. కాగా ఐసీసీ వరల్డ్‌కప్‌ సూపర్‌ లీగ్‌లో భాగంగా పాక్‌ పర్యటన కంటే ముందు నెదర్లాండ్స్‌లో పర్యటించిన వెస్టిండీస్‌ జట్టు ఆతిథ్య జట్టును 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే పాక్‌ వచ్చి అదే రీతిలో ఆతిథ్య జట్టు చేతిలో పరాభవం చూడటం గమనార్హం.

పాకిస్తాన్ వర్సెస్‌ వెస్టిండీస్‌ మూడో వన్డే:
టాస్‌: పాకిస్తాన్‌- తొలుత బ్యాటింగ్‌
పాక్‌ స్కోరు: 269/9 (48)
వెస్టిండీస్‌ స్కోరు: 216 (37.2)
విజేత: డీఎల్‌ఎస్‌ మెథడ్‌లో 53 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ విజయం
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: షాదాబ్‌ ఖాన్‌(78 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 86 పరుగులు)
చదవండి: Rishabh Pant: అదే మా పొరపాటు.. అందుకే ఓడిపోయాం.. ఇక మూడింటికి మూడు గెలవాల్సిందే!
Dwaine Pretorius: ప్రతీసారి కలిసిరాదు.. ఈ చిన్న లాజిక్‌ ఎలా మరిచిపోయారు

మరిన్ని వార్తలు