Ramiz Raja: భరించాం, సహించాం.. మంచి గుణపాఠం చెప్పారు.. కానీ..

21 Sep, 2021 16:07 IST|Sakshi

Ramiz Raja Comments On England and New Zealand Boards: ‘‘ఇంగ్లండ్‌ పాకిస్తాన్‌ టూర్‌ను రద్దు చేసుకోవడం నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే.. ఇది ముందే ఊహించాం. పాశ్చాత్య దేశాలు ఒకరికొకరు మద్దతుగా నిలిచే క్రమంలో ఇలా చేశాయి’’ అని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ రమీజ్‌ రాజా అన్నాడు. నిజంగా ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా పర్యటన రద్దు చేసుకుంటే పర్లేదన్న అతడు.. అయితే, అసలు ఎలాంటి సమస్య ఎదుర్కొన్నారో చెప్పకుండా కివీస్‌ నిర్ణయం తీసుకోవడం తమ ఆగ్రహానికి కారణమని పేర్కొన్నాడు.

కాగా సుదీర్ఘ విరామం తర్వాత పాక్‌ పర్యటనకు అంగీకరించిన న్యూజిలాండ్‌.. తొలి వన్డే(సెప్టెంబరు 17) ప్రారంభానికి కొద్ది గంటల ముందు టూర్‌ రద్దు చేసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబరులో పాకిస్తాన్‌ పర్యటనకు రావాల్సిన తమ పురుష, మహిళా క్రికెట్‌ జట్లను పంపబోమని ఇంగ్లండ్‌ బోర్డు ప్రకటించింది.  ఈ విషయంపై స్పందించిన రమీజ్‌ రాజా ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ముందుగా అనుకున్నట్లుగానే జరిగింది. వాళ్లు పర్యటనకు వస్తామని చెప్పినపుడు అన్ని ఏర్పాట్లు చేశాం. వాళ్ల విజ్ఞప్తి మేరకు అన్ని సౌకర్యాలు అమర్చాం.

నిజానికి మేం అక్కడికి వెళ్లినపుడు వాళ్లు పెట్టిన కఠినమైన నిబంధనలు పాటించాం. తక్కువ చేసే విధంగా మాట్లాడినా భరించాం.. సహించాం. అయితే, ఇప్పుడు మాకు మంచి గుణపాఠం చెప్పారు. ఇకపై మేం కూడా మాకు ఆసక్తి ఉంటేనే టూర్లకు వెళ్తాం’’ అని కివీస్‌, ఇంగ్లండ్‌ తీరును విమర్శించాడు. కాగా గతేడాది పాకిస్తాన్‌ కివీస్‌ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అక్కడ పర్యటించిన పాక్‌ ఆటగాళ్లు క్వారంటైన్‌ రూల్స్‌ అతిక్రమించడం వల్ల కోవిడ్‌ బారిన పడ్డారు. దీంతో.. న్యూజిలాండ్‌ గట్టిగానే పీసీబీని హెచ్చరించింది. ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన రమీజ్‌ రాజా కివీస్‌ వ్యవహారశైలి ఒక్కోసారి ఒక్కోలా ఉంటుందని విమర్శలు చేశాడు.

అన్నీ అంతే.. ఎవరికి ఫిర్యాదు చేయాలి?
‘‘మొన్న న్యూజిలాండ్‌.. ఇప్పుడు ఇంగ్లండ్‌.. ఆ తర్వాత వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా కూడా ఇదే బాటలో నడుస్తాయేమో.. ఇవన్నీ ఒకే బ్లాక్‌కు చెందినవి. ఎవరికని మేం ఫిర్యాదు చేయగలం? వాళ్లను మా వాళ్లుగా మేం అంగీకరించాం. కానీ వాళ్లు అలా చేయడం లేదు’’ అని రమీజ్‌ అన్నాడు.

అక్కడే చూసుకుంటాం..
‘‘మా క్రికెట్‌ బోర్డు ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవాలని మేం పలు సిరీస్‌లు ఆడాం. కానీ మా ఆటగాళ్ల గౌరవానికి భంగం కలగనివ్వం కదా. ఇతర దేశాలు మా పట్ల ఎందుకో విచిత్ర వైఖరి ప్రదర్శిస్తున్నాయి. ఏదేమైనా ఇదో గుణపాఠం. టీ20 వరల్డ్‌కప్‌లో మా టార్గెట్‌ ఒక్కటే.. ముందు మా పొరుగుదేశం(టీమిండియా), ఈ తర్వాత న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌.. గెలుపు మాదే. మీరు మాకు చేసిన నష్టానికి మైదానంలో బదులు తీర్చుకుంటాం’’ అని రమీజ్‌ రాజా వ్యాఖ్యానించాడు.

చదవండి: PBKS Vs RR: వారిద్దరు ఓపెనర్స్‌గా వస్తే గెలుపు అవకాశాలు ఎక్కువ

Poll
Loading...
మరిన్ని వార్తలు