అదే టీమిండియా కొంపముంచింది..

21 Dec, 2020 14:19 IST|Sakshi

అడిలైడ్‌: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఫర్వాలేదనిపించిన కోహ్లి గ్యాంగ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో పూర్తిగా తేలిపోయింది. టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డును లిఖించింది. కనీసం ఆసీస్‌కు పోటీ ఇవ్వకుండానే టీమిండియా లొంగిపోవడంతో విమర్శల వర్షం కురుస్తోంది. అసలు కేఎల్‌ రాహుల్‌ను తీసుకోలేకపోవడమే ఇంతటి ఘోర పరాభవానికి కారణమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా,  టీమిండియా తన టెస్టు చరిత్రలోనే తక్కువ స్కోరుకు ఇన్నింగ్స్‌ను ముగించడం చాలా దారుణమని ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ అంటున్నాడు. ఈ తరహా దారుణ ఓటమికి సరైన ఓపెనింగ్‌ భాగస్వామ్యం రాకపోవడమేనని తెలిపాడు. (చదవండి: స్మిత్, కోహ్లి ర్యాంక్‌లు యథాతథం)

ప్రధానంగా పృథ్వీ షా ఘోర వైఫల్యమే టీమిండియాను వెనక్కునెట్టిందన్నాడు. ‘మిడ్‌ డే’ కు రాసిన కాలమ్‌లో పృథ్వీ షా ప్రదర్శన గురించి  గిల్‌క్రిస్ట్‌ ఇలా చెప్పుకొచ్చాడు. ‘ తొలి టెస్టులో పృథ్వీ షా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. ఓపెనర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. టీమిండియా గతంలో ఇక్కడ పర్యటించిన జట్టులో పృథ్వీషా ఒక సభ్యుడు. పృథ్వీ షాకు ఆస్ట్రేలియాలోని పరిస్థితులు తెలియంది కాదు. పృథ్వీ షాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ వాటిని షా నిలబెట్టలేదు. అతని బ్యాటింగ్‌ టెక్నిక్‌ విమర్శలకు దారితీస్తోంది. బ్యాట్‌కు ప్యాడ్‌కు మధ్య దూరాన్ని అంచనా వేయడంలో షా విఫలం అయ్యాడు. ఓపెనర్‌గా షా తొందరగా విఫలం కావడమే టీమిండియా కొంపముంచింది. ఆస్ట్రేలియాలో పరిస్థితులు తెలిసినా షాట్ల ఎంపిక సరిగా లేదు. అతనొక టాలెంటెడ్‌ యువ క్రికెటర్‌. కానీ తొలి టెస్టులో అతని ఆట సెలక్టర్లను డైలమాలో పడేసింది. బాక్సింగ్‌ డే టెస్టుకు షాను పక్కకు పెట్టి శుబ్‌మన్‌ గిల్‌కు అవకాశం కల్పించాలి’ అని గిల్‌క్రిస్ట్‌ పేర్కొన్నాడు. (నీదే పిల్లాడి మనస్తత్వం అందుకే, ఇలా..)

మరిన్ని వార్తలు