శ్రీలంక పర్యటనకు కోచ్‌గా ద్రవిడ్‌

21 May, 2021 04:36 IST|Sakshi

టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టు బాధ్యతలు  

ముంబై: భారత ‘ఎ’, అండర్‌–19 జట్లకు కోచ్‌గా యువ ఆటగాళ్లను తీర్చిదిద్దిన మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తొలి సారి సీనియర్‌ టీమ్‌తో కలిసి పని చేయనున్నాడు. వచ్చే జూలైలో శ్రీలంకలో పర్యటించే భారత జట్టుకు ద్రవిడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తాడు. భారత ద్వితీయ శ్రేణి జట్టుగా గుర్తించబడుతున్న ఈ టీమ్‌లో పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌లు అయిన పలువురు యువ ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. టూర్‌లో భాగంగా భారత్, లంక మధ్య 3 వన్డేలు, 3 టి20లు మ్యాచ్‌లు జరుగుతాయి. అగ్రశ్రేణి ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్‌తో టెస్టుల్లో తలపడుతున్న సమయంలోనే ఈ సిరీస్‌ జరగనుంది.

హెడ్‌ రవిశాస్త్రితో పాటు బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ కూడా అక్కడే ఉంటారు. దాంతో మరో ప్రత్యామ్నాయం కోసం చూసిన బీసీసీఐ...ద్రవిడ్‌ను అందుకు సరైన వ్యక్తిగా గుర్తించింది. పైగా జట్టులో ఎంపికయ్యే అవకా శం ఉన్న యువ ఆటగాళ్లందరూ ఇప్పటి వరకు అండర్‌–19, ‘ఎ’ టీమ్‌ సభ్యులుగా ద్రవిడ్‌ మార్గనిర్దేశనంలోనే తమ ఆటను మెరుగపర్చుకున్నవారే. దాంతో జట్టు పని మరింత సులువవుతుందని బోర్డు భావించింది. ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్‌గా వ్యవహరిస్తున్న ద్రవిడ్‌... కొన్నాళ్ల క్రితమే అండర్‌–19, ‘ఎ’ టీమ్‌ బాధ్యతలనుంచి తప్పుకున్నాడు. శ్రీలంక పర్యటనకు భారత మాజీ పేసర్, యూత్‌ కోచ్‌ పారస్‌ మాంబ్రే బౌలింగ్‌ కోచ్‌గా వెళ్లే అవకాశం ఉంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు