#SureshRaina: ఎల్‌పీఎల్‌ చరిత్రలో తొలిసారి వేలం.. కళ్లన్నీ ఆ క్రికెటర్‌పైనే

14 Jun, 2023 12:32 IST|Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) అంత కాకపోయినా లంక ప్రీమియర్‌ లీగ్‌(ఎల్‌పీఎల్‌) కూడా బాగానే ప్రజాధరణ పొందుతుంది. గత సీజన్‌ ఇందుకు ఉదాహరణ. ఇప్పటివరకు ఐపీఎల్‌ మినహా మిగతా లీగ్‌ల్లో ఆడేందుకు సముఖత చూపని టీమిండియా మాజీ క్రికెటర్లు ఇప్పుడు  బయటి లీగుల్లోనూ దర్శనమిస్తున్నారు. తాజాగా 2023 సీజన్‌కు సంబంధించి జూన్‌ 14న(బుధవారం) లంక ప్రీమియర్‌ లీగ్‌లో తొలిసారి వేలం జరగనుంది.

ఈ మేరకు శ్రీలంక క్రికెట్‌ బోర్డు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ వేలానికి 500 మంది ఆటగాళ్లు తమ పేరును రిజిస్టర్‌ చేసుకున్నారు. వేలంలో ఐదు ఫ్రాంచైజీలు పాల్గొననుండగా.. ఐపీఎల్‌లో అనుసరించిన విధానాన్నే ఇక్కడ అమలు చేయనున్నారు. మొత్తం ఆటగాళ్ల కోసం 5లక్షల అమెరికన్‌ డాలర్డు ఖర్చు చేయనున్నారు. ఇక తొలిసారి జరగనున్న వేలానికి చారు శర్మ హోస్ట్‌గా వ్యవహరించనుండడం విశేషం. 

ఇక టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా లంక ప్రీమియర్‌ లీగ్‌లో ఆడేందుకు తన పేరును రిజిస్టర్‌ చేసుకోవడం ఆసక్తి కలిగించింది. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేరు పొందిన రైనాకు మంచి ధర పలికే అవకాశం ఉంది. 50వేల యూఎస్‌ డాలర్ల కనీస ధరతో రైనా వేలంలోకి రానున్నాడు. సెప్టెంబర్‌ 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన రైనా ఆ తర్వాత 2023లో అబుదాబి టి10 టోర్నీలో పాల్గొన్నాడు.

అయితే వేలానికి ముందే ఆయా ఫ్రాంచైజీలు కొందరు స్టార్‌ ప్లేయర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వారిలో బాబర్‌ ఆజం, షకీబ్‌ అల్‌ హసన్‌ లాంటి స్టార్‌ క్రికెటర్లు ఉన్నారు. వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు ఒప్పందం చేసుకున్న ఆటగాళ్లు వీరే..
కొలంబో స్ట్రైకర్స్: బాబర్ ఆజం, మతీషా పతిరనా, నసీమ్ షా, చమికా కరుణరత్నే
► దంబుల్లా ఆరా: మాథ్యూ వేడ్, కుసల్ మెండిస్, లుంగి ఎన్‌గిడి, అవిష్క ఫెర్నాండో
► జాఫ్నా కింగ్స్: మహేశ్ తీక్షణ, డేవిడ్ మిల్లర్, తిసర పెరీరా, రహ్మానుల్లా గుర్బాజ్
► క్యాండీ ఫాల్కన్స్: వనిందు హసరంగా, ఏంజెలో మాథ్యూస్, ముజీబ్ ఉర్ రెహమాన్, ఫఖర్ జమాన్
► గాలే గ్లాడియేటర్స్: భానుక రాజపక్స, దసున్ షనక, షకీబ్ అల్ హసన్, తబ్రైజ్ షమ్సీ

ఇప్పటివరకు మూడు సీజన్లు విజయవంతం కాగా నాలుగో సీజన్‌ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా జూలై 30 నుంచి ఆగస్టు 20 వరకు లంక ప్రీమియర్‌ లీగ్‌ నాలుగో ఎడిషన్‌ జరగనుంది.

చదవండి: ఒక రాధా.. ఇద్దరు కృష్ణులు!

మరిన్ని వార్తలు