Ranji Trophy 2022 Final: సర్ఫరాజ్‌ సూపర్‌ సెంచరీ.. ముంబై 374 పరుగులకు ఆలౌట్‌..!

24 Jun, 2022 08:38 IST|Sakshi

బెంగళూరు: రంజీ ట్రోఫీ సీజన్‌లో తొలి మ్యాచ్‌నుంచి చెలరేగుతూ వచ్చిన ముంబై బ్యాట్స్‌మన్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ ఫైనల్‌ పోరులోనూ అదే జోరును కొనసాగించాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ (243 బంతుల్లో 134; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో సత్తా చాటాడు. కఠిన పరిస్థితులను అధిగమించి అతను చూపించిన బ్యాటింగ్‌తో ప్రదర్శనతో ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులకు ఆలౌటైంది. ఈ సీజన్‌లో సర్ఫరాజ్‌కు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. మరో 2 అర్ధ సెంచరీలు సహా 133.85 సగటుతో సర్ఫరాజ్‌ ఏకంగా 937 పరుగులు సాధించాడు.

గత రంజీ సీజన్‌ రద్దు రాగా, 2019–20 సీజన్‌లో కూడా సర్ఫరాజ్‌ 928 పరుగులు చేశాడు. ఫైనల్లో మరో ఇన్నింగ్స్‌ ఆడే అవకాశం వస్తే అతను 1000 పరుగులు దాటవచ్చు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మధ్యప్రదేశ్‌ రెండో రోజు గురు వారం ఆట ముగిసే సమయానికి వికెట్‌ కోల్పోయి 123 పరుగులు చేసింది. హిమాన్షు మంత్రి (31) అవుట్‌ కాగా, యశ్‌(44 నాటౌట్‌), శుభమ్‌ శర్మ (41 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ మరో 251 పరుగులు వెనుకబడి ఉంది.  

అతనొక్కడే... 
రెండో రోజు ముంబై తమ ఓవర్‌నైట్‌ స్కోరుకు 126 పరుగులు జోడించగా...అందులో సర్ఫరాజ్‌ ఒక్కడే 94 పరుగులు చేశాడు. 248/5తో ముంబై ఆట కొనసాగించగా, రెండో బంతికే షమ్స్‌ ములాని (12) వెనుదిరిగాడు. దాంతో జట్టును ఆదుకునే భారం సర్ఫరాజ్‌పై పడింది. చివరి వరుస ఆటగాళ్లను కాపాడుకుంటూ పట్టుదలగా ఆడిన అతను మధ్యప్రదేశ్‌ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. ప్రత్యర్థి కెప్టెన్‌ శ్రీవాస్తవ ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడిని నిలువరించలేకపోయాడు.

కార్తికేయ బౌలింగ్‌లో నేరుగా కొట్టిన ఫోర్‌తో 190 బంతుల్లో సర్ఫరాజ్‌ సెంచరీ పూర్తయింది. ఆ సమయంలో గాల్లోకి ఎగిరి భావోద్వేగం ప్రదర్శించిన అతను...ఇటీవల మరణించిన పంజాబీ గాయకుడు మూసేవాలా శైలిలో తొడకొట్టి సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత తన స్కోరుకు మరిన్ని పరుగులు జోడించిన అనంతరం వేగంగా ఆడే క్రమంలో చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం మధ్యప్రదేశ్‌కు హిమాన్షు శుభారంభం అందించాడు. తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించిన అనంతరం హిమాన్షును తుషార్‌ అవుట్‌ చేశాడు. అయితే యశ్, శుభమ్‌ కలిసి క్రీజ్‌లో పట్టుదలగా నిలిచారు.
చదవండి: TNPL 2022: 38 ఏళ్ల వయసులో క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న భారత ఆటగాడు..!

మరిన్ని వార్తలు